- ఈ సారి అడ్మిషన్లు రివర్స్ గేర్
- సర్కారు నుంచి ప్రైవేట్ వైపు మళ్లింది కేవలం 10 వేల మందే
- ఓ వైపు ఫీజుల భారం.. మరోవైపు ప్రభుత్వ విద్యపై పెరిగిన నమ్మకం
- ఏఐ క్లాసులు, ఇంగ్లిష్ మీడియంతో పాటు టీచర్ల బోధనపై విశ్వాసం
- సర్కారు బడుల్లో చదివితేనే ఫౌండేషన్ బలంగా ఉంటుందనే అభిప్రాయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడులపై తల్లిదండ్రుల నమ్మకం క్రమంగా పెరుగుతోంది. ప్రైవేట్ స్కూళ్ల పై భ్రమలను వీడుతున్న సామాన్య, మధ్యతరగతి వర్గాలు గవర్నమెంట్ చదువుల వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రైవేట్ స్కూళ్ల నుంచి ఏకంగా లక్ష మందికి పైగా విద్యార్థులు సర్కారు బడుల్లో చేరారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల భారం పెరగడంతోపాటు ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు మెరుగుపడడం, ఏఐ కాసులు, ఇంగ్లీష్ మీడియంతోపాటు టీచర్ల బోధన పట్ల విశ్వాసం పెరగడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సర్కార్ బడులపై పేరెంట్స్ ఆసక్తి
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపడ్తున్న చర్యలతో ప్ర భుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించేందుకు పేరెంట్స్ ఆసక్తి చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేటు స్కూళ్ల నుంచి సర్కారు బడులకు మారిన విద్యార్థుల సంఖ్య శుక్రవారం నాటికి 1,00,174కి చేరుకుంది. అంటే సరిగ్గా లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల వైపు మళ్లారు. దీనికి భిన్నంగా... గవర్నమెంట్ స్కూళ్ల నుంచి ప్రైవేటుకు వెళ్లిన విద్యార్థులు కేవలం 10,490 మంది మాత్రమే ఉండడం గమనార్హం.
అంటే ప్రైవేట్ నుంచి సర్కారుకు వచ్చే వారి సంఖ్యతో పోలిస్తే, బయటకు వెళ్లే వారు కేవలం 10 శాతమే. ఇది ప్రభుత్వ బడులపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని అధికారులు, టీచర్లు చెబుతున్నారు.
నిజామాబాద్ లో ఎక్కువ..
ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కారు బడుల్లో చేరుతున్న వారిలో నిజామాబాద్ ముందు వరుసలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 8,461 మంది విద్యార్థులు ప్రైవేటును వదిలి ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. ఆ తర్వాతి స్థానాల్లో జగిత్యాల (6,010) , రంగారెడ్డి (5,524) , కామారెడ్డి (5,284) , నల్గొండ (4 ,919) జిల్లాలు ఉన్నాయి.
రాష్ట్ర రాజధాని నగర ప్రాంతాలైన హైదరాబాద్ (2,527), మేడ్చల్ మల్కాజిగిరి (3,538) జిల్లాలో కూడా గణనీయంగానే మార్పు వచ్చింది. అత్యల్పంగా ములుగు జిల్లాలో 566 మంది మాత్రమే ప్రైవేట్‌ను వదిలి సర్కారు బడిబాట పట్టారు. మరోపక్క సర్కారు నుంచి ప్రైవేటు బడుల్లో చేరిన జిల్లాల్లో ఖమ్మం జిల్లా (868 మంది) టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానంలో నిజామాబాద్ (811), రంగారెడ్డి (759), మేడ్చల్ (631), కామారెడ్డి (603) జిల్లాలున్నాయి. ఇదే కేటగిరీలో తక్కువ మంది చేరిన వారిలోనూ ములుగు (28) చివరిలో ఉండడం గమనార్హం.
మార్పు ఎందుకంటే..
ప్రైవేటు బడుల్లో ఆకాశాన్నంటుతున్న ఫీజులు, డొనేషన్ల భారం మధ్యతరగతి, పేద వర్గాలకు శాపంగా మారాయి. అదే సమయంలో ప్రభుత్వ బడుల్లో పెరుగుతున్న మౌలిక వసతులు, ఇంగ్లిష్ మీడియం బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌తోపాటు మధ్యాహ్న భోజనంలాంటి సౌకర్యాలు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది నుంచి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్, వెల్‌కమ్ కిట్, ఏఐ , డిజిటల్ పాఠాలు పేరెంట్స్ ఆలోచనలను ప్రైవేటు నుంచి సర్కారు వైపు మళ్లించాయి.
సర్కారు బడుల్లో చదివితేనే ఫౌండేషన్ బలంగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఈ మార్పునకు కారణమని అధికారులు చెప్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలు మరింత పటిష్టం అయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
