ఇంటర్ కాలేజీల అఫిలియేషన్లు పూర్తయ్యాకే అడ్మిషన్లు చేపట్టాలి

ఇంటర్ కాలేజీల అఫిలియేషన్లు పూర్తయ్యాకే అడ్మిషన్లు చేపట్టాలి
  • ఇంటర్ బోర్డు సెక్రటరీకి ఏఐవైఎఫ్ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ పూర్తయ్యే దాకా అడ్మిషన్లు నిలిపివేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. బుధవారం ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజాను ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ.. కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయకుండా అడ్మిషన్లు చేపట్టడం సరికాదన్నారు. 

నిబంధనల ప్రకారం గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే చేరాల్సి ఉన్నా.. కార్పొరేట్ కాలేజీల మాయాజాలంతో అఫిలియేషన్లు లేని కాలేజీల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నారని చెప్పారు. అడ్మిషన్ ఒకచోట.. క్లాసులు ఇంకో చోట నిర్వహిస్తూ పేరెంట్స్‌‌ను కాలేజీలు మోసం చేస్తున్నాయన్నారు. కార్పొరేట్ కాలేజీలు ఐపీఎల్, ఐకాన్, నియాన్, పాస్ట్ ట్రాక్, కో స్పార్క్ లాంటి అనాధికర సెక్షన్ల పేరుతో స్టూడెంట్లను అయోమయంలో పడేస్తున్నారని తెలిపారు. 

ఇంటర్ బోర్డు వెంటనే గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీల లిస్టును రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.