
బతకడానికి బహు పాట్లు అన్నారు పెద్దలు. అన్నట్లుగానే కొందరు తప్పుడు దారుల్లో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ప్రజలు వాడే నిత్యావసరాలను కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అలా కల్తీ చేసి ప్రజలను మోసగిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు.
శంషాబాద్ జోన్ డీటీఎఫ్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫంక్షన్ హాల్లలో జరిగే శుభకార్యాలను టార్గెట్ గా చేసుకుని కల్తీ మద్యం అమ్ముతున్నారు కొందరు కేటుగాళ్లు. తమ వద్ద ఖరీదైన ఢిల్లీ బ్రాండ్స్ మద్యం బాటిళ్లు ఉన్నాయని చెప్పి.. మార్కెట్ ధర కన్నా తక్కువకు ఇస్తామని ఆశ చూపి సొమ్ము చేసుకుంటున్నారు.
బ్రాండెడ్ బాటిళ్లలో కల్తీ మద్యం అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో రాజేంద్ర నగర్ కాటేదాన్ ప్రాతంలో దాడులు నిర్వహించారు ఎక్సైజ్ పోలీసులు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై జి . శ్రీకాంత్‌రెడ్డి, సిబ్బంది పారుకోద్దీన్ గణేష్, నెహ్రు, సాయి శంకర్‌లతో కలిసి రాజేంద్రనగర్ కాటేదాన్ ప్రాంతంలో దాడి చేశారు. 72 మద్యం బాటిళ్లు(54 లీటర్ల ), కారు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకునారు. కల్తీ మద్యం అమ్ముతున్న వారి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు