- ఎక్స్పైరీ సరుకు సేకరించి.. కొత్తగా ప్యాక్చేసి తక్కువ ధరకు అమ్మకం
- వట్టినాగులపల్లిలో తండ్రీకొడుకుల అక్రమ దందా
- 5 వేల లీటర్ల కల్తీ వంట నూనె, 5 టన్నుల గోధుమ పిండి సీజ్
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్సిటీలో వంట నూనె, గోధుమ పిండిని కల్తీ చేస్తున్న తండ్రీకొడుకులను తాజాగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి నగరానికి వచ్చి ఐటీ కారిడార్లోని వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో స్థిరపడిన భన్వర్ రామ్ జాట్(46), అతడి కొడుకు అశోక్ కుమార్ స్థానికంగా శ్రీ జస్నాత్ ట్రేడర్స్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నారు. ఎక్స్పైరీ అయిన వంట నూనెలు సేకరించి సోయాబిన్ నూనెతో కలిపి కల్తీ వంట నూనె తయారు చేస్తున్నారు. ఈ నూనెను మార్కెట్లో దొరికే ప్రముఖ బ్రాండ్ల కవర్లలో ప్యాకింగ్చేస్తూ అమ్ముతున్నారు. గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పామాయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూజా ఆయిల్ వంటి పేర్లతో అమ్ముతున్నారు.
గోధుమ పిండినీ వదల్లే..
నూనెతో పాటు గడువు తీరిన గోధుమ పిండిని పలు ప్రాంతాల నుంచి సేకరించి, జన్నత్ గోల్డ్ చక్కీ ఆటా పేరుతో ప్యాక్చేసి అమ్ముతున్నారు. మార్కెట్లలో మిగతా గోధుమ పిండి ప్యాకెట్లతో పోలిస్తే తక్కువ ధరకు అమ్ముతుండడంతో కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపేవారు. ఈ దందాపై సమాచారం అందుకున్న మాదావూర్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం దుకాణంపై దాడులు చేశారు. రూ.10 లక్షల విలువైన 5,026 లీటర్ల కల్తీ వంట నూనె, రూ.3 లక్షల విలువైన 5,192 కిలోల గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు.
