సిటీలో మరో కల్తీ కల్లు ఘటన!

సిటీలో మరో కల్తీ కల్లు ఘటన!
  • కుత్బుల్లాపూర్​లో కల్లు తాగిన ఇద్దరికి అస్వస్థత
  • గాంధీ దవాఖానకు తరలింపు

జీడిమెట్ల, వెలుగు: సిటీలో మరో కల్తీ కల్లు ఘటన కలకలం రేపింది. ఇటీవల కూకట్​పల్లి, బాలానగర్​లో కల్తీ కల్లు తాగి పలువురు మృతి చెందిన ఘటన మరవకముందే ఆదివారం కుత్బుల్లాపూర్​ పరిధిలో కల్లు తాగి ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్​ జిల్లా భూపాల్​ మండలం మంచి గ్రామానికి చెందిన ధరావత్​ లచ్చిరామ్​ (50), సాక్రిబాయ్​ (45) దంపతులు. తమ కొడుకుతో కలిసి ఆరు నెలల కింద కుత్బుల్లాపూర్ ​నియోజకవర్గంలోని సుభాష్​నగర్​డివిజన్​రాంరెడ్డినగర్​కు వలస వచ్చారు. 

స్థానికంగా జీడిమెట్ల ఇండస్ట్రియల్​ఏరియా ఉండడంతో వీరు ముగ్గురూ రోజువారీ  కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం సాయంత్రం షాపూర్​నగర్, రాంరెడ్డినగర్​లోని కల్లు కంపౌండ్​ల నుంచి వీరి కొడుకు కల్లును ఇంటికి పార్సల్​తీసుకెళ్లగా, దంపతులిద్దరూ తాగారు. అనంతరం ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వింతగా ప్రవర్తించారు. దీంతో సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు తరలించగా, అక్కడ చికిత్స తీసుకున్న అనంతరం స్వగ్రామానికి వెళ్లారు. 

అక్కడ కూడా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో ఎక్సైజ్​ అధికారులు, పోలీసులు పలు కల్లు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. కల్లు నమూనాలు సేకరించి ల్యాబ్​కు పంపామని, ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ కల్లు తయారు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కల్లు దుకాణాల్లో తరచూ తనిఖీలు చేయాలని, కల్తీ కల్లు తయారీ దారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.