డౌట్స్ క్లియర్ చేస్తున్న వాట్సాప్ చదువులు

డౌట్స్ క్లియర్ చేస్తున్న వాట్సాప్ చదువులు

మరికొద్ది గంటల్లో ఎగ్జామ్. అంతా బాగానే ఉందనిపించినా, ఓ చిన్న డౌట్ అలానే బ్రెయిన్​లో తిరుగుతుంటుంది. టీచర్​తో ఓసారి మాట్లాడితే బావుండబ్బా అనిపిస్తుంది. ఆ టైంలో టీచర్ ను కలవడం ఎంత కష్టమో వాట్సాప్ రాక ముందు స్టూడెంట్​గా ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, నేటి చదువులు మాత్రం  వాట్సాప్​లో సాగుతున్నాయి. ఎగ్జామ్​కు ఒక్క నిమిషం ముందు డౌట్ అడిగినా టీచర్లు, చిన్న మెసేజ్​తో క్లియర్ చేసేస్తున్నారు! మొన్న ఐఎస్సీ 12వ తరగతిలో టాపర్​గా నిలిచిన ఢిల్లీ అమ్మాయి శ్రుతి భోంబే ‘వాట్సాప్ చదువు’కు కరెక్టు ఉదాహరణ. ఫైనల్ ఎగ్జామ్స్ కు రెండ్రోజుల ముందు శ్రుతి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై తనకున్న అన్ని అకౌంట్లను డిలీట్ చేసేసింది. ఒక్క వాట్సాప్​ను మాత్రం అలానే ఉంచింది. లాస్ట్ మినిట్ డౌట్స్ కోసమే వాట్సాప్ అకౌంట్​ను డిలీట్ చేయలేదని పేర్కొంది. ‘‘ప్రతి సబ్జెక్టుకూ వేర్వేరు గ్రూపులు ఉన్నాయి. వాటిలో నిరంతరం ఏదో ఓ టాపిక్ పై డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది” అని చెప్పింది. స్టూడెంట్స్ డౌట్స్ క్లియర్ చేయడానికి టీచర్లు వాట్సాప్ మాత్రమే కాకుండా పలు రకాల సోషల్ మీడియా టూల్స్ పై ఆధారపడుతున్నారు. కొన్నిసార్లు వీడియో కాల్స్, స్కైప్ ద్వారా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ప్రముఖ ప్రైవేటు స్కూళ్లలో ఇదో ట్రెండ్ గా మారిపోయింది.

‘వాట్సాప్’ పద్ధతి పనిచేస్తోంది

వాట్సాప్​తో డౌట్లు క్లియర్ చేసే పద్ధతి  బాగా పని చేస్తోందని టీచర్లు చెబుతున్నారు. వాట్సాప్​లో ఓ స్టూడెంట్ అడిగే ప్రశ్న, మిగతా వాళ్లందరికీ పనికొస్తుందన్నారు. తల్లిదండ్రులూ  వాట్సాప్ చదువుపై హ్యాపీగా ఉన్నట్లు తెలిపారు. ప్రిపరేషన్ హాలిడేస్​లో కూడా డౌట్స్ క్లియర్​ చేసేందుకు వాట్సాప్ బాగా ఉపయోగపడుతోందని వెల్లడించారు.

ప్రతికూలతలూ ఉన్నాయ్..

వాట్సాప్ చదువుల వల్ల ప్రతికూలతలు ఉన్నా.. అనుకూలతలు వాటిని పక్కనబెట్టేలా చేస్తున్నాయట. వాట్సాప్ స్టడీ వల్ల కొత్తగా నేర్చుకుంటున్నదేమీ లేదని ‘‘ఎఫెక్టివిటీ ఆఫ్ ఈ లెర్నింగ్ థ్రూ వాట్సాప్’’ అనే రీసెర్చ్ స్టడీలో తేలింది. తరగతి గదుల్లో చెప్పిన దాని కంటే కొత్త విషయాలేవీ వాట్సాప్​లో షేర్ చేయడం లేదని వివరించింది. వందల మంది ఉండే గ్రూప్స్​లో ప్రశ్నలు వరదలా వస్తాయని, ఇది స్టూడెంట్ ఫోకస్ ను దెబ్బతీస్తుందని పేర్కొంది. అంతేకాకుండా కళ్లు కూడా బాగా స్ట్రెయిన్ అవుతాయని చెప్పింది. చిన్న గ్రూపులు క్రియేట్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని స్టడీ చేసిన సంస్థ వెల్లడించింది.

మిస్సైన క్లాసులూ వాట్సాప్ లోనే..

బంద్, పొల్యూషన్ హాలిడేస్ ఇలా స్కూళ్లు మూతపడినా, ప్రైవేటు స్కూళ్లలో వాట్సాప్, స్కైప్ ద్వారా క్లాసులు నడిచిపోతున్నాయి. స్టూడెంట్స్ తల్లిదండ్రులు కూడా సొంతంగా గ్రూపులు పెట్టుకుని, నోట్సులు, పాత క్వశ్చన్ పేపర్లను షేర్ చేసుకుంటున్నారు. ముందు ముందు వాట్సాప్ లేని చదువేంటబ్బా అనే రోజులొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నమాట!