ఎమ్మెల్యేల కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలి: బీజేపీ తరఫు అడ్వకేట్​

ఎమ్మెల్యేల కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలి: బీజేపీ తరఫు అడ్వకేట్​
  •     కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలి: బీజేపీ తరఫు అడ్వకేట్​
  •     చట్ట ప్రకారమే సిట్​ ఎంక్వైరీ సాగుతున్నది: ఏజీ
  •     ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్​

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిట్‌‌ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన వేర్వేరు రిట్‌‌ పిటిషన్లపై హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. గురువారం ఇరుపక్షాల వాదనలు పూర్తి అవ్వడంతో తీర్పు తర్వాత చెప్తామని తెలిపింది. బీజేపీ స్టేట్‌‌ జనరల్‌‌ సెక్రటరీ జి.ప్రేమేందర్‌‌రెడ్డి, నిందితులు నందుకుమార్, సింహయాజీ, రామచంద్రభారతి, కరీంనగర్‌‌ అడ్వకేట్‌‌ బి. శ్రీనివాస్, తుషార్‌‌ తదతరులు సీబీఐ దర్యాప్తు కోరుతూ రిట్లు వేశారు. వీటిపై జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి గురువారం తీర్పును వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ తరఫున సీనియర్‌‌ లాయర్‌‌ జె.ప్రభాకర్‌‌ వాదిస్తూ.. సిట్‌‌కు నాయకత్వం వహిస్తున్న ఐపీఎస్‌‌ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని చేసే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా ఆ అధికారి ప్రభుత్వానికి అనుకూలంగా సిట్‌‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయనున్నారని చెప్పారు. సీల్డ్‌‌ కవర్లలో సీడీలు, పెన్‌‌డ్రైవ్‌‌లను సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలకు సీఎం పంపారని, మీడియా సమావేశంలో అనేక విషయాలు చెప్పారని, ఆ తర్వాతే సిట్‌‌ ఏర్పాటైందని తెలిపారు. సిట్‌‌ దర్యాప్తు ఎలా ఉండాలో సీఎం మీడియా సమావేశం ద్వారా బహిరంగంగా సంకేతాలు ఇచ్చారని అన్నారు. సిట్‌‌ దర్యాప్తు ప్రభుత్వానికి అనుకూలంగానే సాగుతున్నదని వాదనలు వినిపించారు. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోహిత్​రెడ్డిపై పలు కేసులు ఉన్నాయని అన్నారు.

సిట్​ దర్యాప్తు చేయొచ్చు: ఏజీ

సిట్‌‌ తరఫు అడ్వకేట్‌‌ జనరల్‌‌ బి.ఎస్‌‌. ప్రసాద్‌‌ స్పందిస్తూ.. సిట్‌‌ దర్యాప్తు చట్ట ప్రకారమే సాగుతున్నదని తెలిపారు. మొయినాబాద్‌‌ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ప్రభుత్వం కేసును సిట్‌‌కు ఇచ్చిందని చెప్పారు. అవినీతి నిరోధక కేసులను సిట్‌‌ దర్యాప్తు చేయవచ్చా..? అని హైకోర్టు ప్రశ్నించగా.. చేయవచ్చని ఏజీ జవాబిచ్చారు. అవినీతికి చెందిన కేసును ఏసీబీ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదా అని హైకోర్టు ప్రశ్నించగా.. లేదని బదులిచ్చారు. చట్ట ప్రకారం జీవోల ద్వారా సిట్​ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. సిట్‌‌ను కాదని కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరం లేదని ఏజీ చెప్పారు. ఈ కేసుకు చెందిన సీడీలు, పెన్‌‌డ్రైవ్, ఎఫ్‌‌ఐఆర్‌‌ కాపీలు ఇవ్వాలని పిటిషనర్లు వేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ అవసరం లేదని అన్నారు. మెయిన్‌‌ పిటిషన్‌‌పై విచారణ పూర్తి చేసి జడ్జిమెంట్‌‌ చెప్పాలని కోరారు. వాదనలు ముగియడంతో జడ్జి కల్పించుకొని.. అనుబంధ పిటిషన్లపై ఎవరైనా విచారణ చేయాల్సివస్తే శుక్రవారం వాదనలు చెప్పవచ్చన్నారు. సిట్‌‌ దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలన్న ప్రధాన పిటిషన్‌‌పై తీర్పును రిజర్వులో పెడుతున్నట్లు ప్రకటించారు.