V6 News

ప్రతి కుటుంబానికి సొంతిల్లే లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ప్రతి కుటుంబానికి సొంతిల్లే లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • అఫర్డబుల్ హౌసింగ్ పాలసీని ఖరారు చేస్తున్నం: పొంగులేటి
  • ప్రైవేట్ బిల్డర్లకు ప్రభుత్వ ల్యాండ్స్ ఇస్తే ఇండ్లు నిర్మిస్తం: క్రెడాయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సొంత ఇంటి వసతిని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లు అందేలా కొత్త అఫర్డబుల్ హౌసింగ్ పాలసీని తీసుకొస్తున్నట్లు చెప్పారు.

గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా మంగళవారం ‘అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్బన్ ఫ్యూచర్ – తెలంగాణ మోడల్ 2047’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మంత్రి పొంగులేటి మాట్లాడారు. "పెరుగుతున్న పట్టణీకరణ, విస్తరిస్తున్న గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశానికే ఆదర్శంగా నిలిచే పాలసీని రూపొందిస్తున్నం. ఇందిరమ్మ ఇండ్ల స్కీంలో 3.5 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.

హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు దాదాపు ఒక లక్ష ఇళ్లు నిర్మించాం. అయినప్పటికీ గృహాల డిమాండ్ -సరఫరా మధ్య ఇంకా భారీ అంతరం ఉంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య పేద, -మధ్య తరగతి ప్రజలకు కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇళ్లు నిర్మించే ఆలోచన ఉంది. రాష్ట్రాన్ని మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించి వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాం.

ఐటీ కారిడార్లలో అద్దె ఇళ్లు, అర్బన్ ఏరియాల్లో టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు, పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులకు ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. కొత్త అఫర్డబుల్ హౌసింగ్ పాలసీలో ఇటీవల ప్రకటించిన క్యూర్, ప్యూర్, రేర్ జోన్లకు అనుగుణంగా నిర్మాణ విధానాలను నిర్దేశిస్తాం" అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సదస్సులో హడ్‌‌‌‌‌‌‌‌కో ఎండీ వి. సురేశ్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

రేట్లు పెరగడంతోనే ఇబ్బందులు

తెలంగాణలో క్రెడాయ్ కీలక పాత్ర పోషిస్తున్నదని క్రెడాయ్ ప్రెసిడెంట్ రామ్ రెడ్డి తెలిపారు. భూముల ధరలు, నిర్మాణ ఖర్చు పెరగడంతో రూ. 50 లక్షలలోపు అపార్ట్ మెంట్ లు ఇవ్వలేకపోతున్నామన్నారు. ప్రభుత్వ భూములను పీపీపీ మోడల్ కింద డెవలపర్స్ కి ఇస్తే పబ్లిక్ కు ఇండ్లు నిర్మించేందుకు రెడీ గా ఉన్నామన్నారు. దేశంలోని మెట్రో సిటీల్లో భూముల ధరలు భారీగా పెరిగాయని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి అభిజిత్ శంకర్ రే తెలిపారు.

చిన్న సిటీల్లో ధరలు తక్కువ ఉన్నందున అక్కడికి రవాణా వసతులు మెరుగుపర్చి, టౌన్ షిప్ల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. రాంకీ ఎండీ నందకిషోర్ మాట్లాడుతూ.. మధ్యతరగతి ప్రజలు రూ.50 లక్షలోపే ఇంటి కొనుగోలుకు రెడీగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ లో ఎంఐజీ, ఎల్ఐజీ పద్ధతుల్లో ఇండ్ల నిర్మాణం చేయోచ్చని సూచించారు.