AFG vs NED: నెదర్లాండ్స్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం.. సెమీస్ రేసు మరింత రసవత్తరం

AFG vs NED: నెదర్లాండ్స్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం.. సెమీస్ రేసు మరింత రసవత్తరం

వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత డచ్ బ్యాటర్లను 179 పరుగులకే కట్టడి చేసిన ఆఫ్ఘన్లు.. అనంతరం లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి మరో 18.3 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించారు. ఈ  విజయంతో సెమీస్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇండియా, సౌతాఫ్రికా సెమీస్ చేరేది ఖాయంగా కనిపిస్తున్నా.. మరో రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

180 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్  మరో 18.3 ఓవర్లు మిగిలివుండగానే చేధించింది. దీంతో ఆ జట్టు రన్ రేట్ మెరుగుపడటమే కాకుండా, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది. రెహ్మత్‌ షా (52; 54 బంతుల్లో 8 ఫోర్లు), కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (56 నాటౌట్‌; 64 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు.

అంతకుముందు నలుగురు బ్యాటర్లు రనౌట్ల రూపంలో పెవిలియన్ చేరడంతో నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది ఎంగెల్ బ్రెచ్ (58) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఆప్ఘనిస్తాన్ బౌలర్లలో మహ్మద్ నబీకి మూడు వికెట్లు దక్కాయి. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముజీబుర్ రెహ్మాన్ ఒక వికెట్ తీసుకున్నాడు.

భారత్, దక్షణాఫ్రికా

ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మినహా అన్ని జట్లు ఏడేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో అన్నింటా విజయం సాధించి భారత జట్టు అగ్రస్థానంలో ఉండగా, 6 విజయాలతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. ఇందులో టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. మెరుగైన నెట్‌ రన్‌రేట్ ఉన్న నేపథ్యంలో తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా దక్షణఫ్రికా సెమీస్ చేరుతుంది. ఇక మిగిలింది రెండు స్థానాలు. ఈ  రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

పాక్ సెమీస్ చేరుతుందా..?

ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సమంగా(4 మ్యాచ్ ల్లో) విజయాలు సాధించాయి. అందరి ఖాతాలో 8  పాయింట్లే ఉన్నా మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఇక మూడింటిలో విజయం సాధించి 6వ స్థానంలో ఉన్న పాకిస్తాన్‌కు సెమీస్ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పాక్ సెమీస్‌ చేరాలంటే తర్వాత ఆడబోయే న్యూజిలాండ్‌తో పాటు ఇంగ్లాండ్‌ను ఓడించాలి. అదే సమయంలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్‌, న్యూజిలాండ్‌ లు తర్వాత ఆడబోయే మ్యాచ్‌ల్లో ఓడాలి.