Asia Cup 2025: ఒమర్జాయ్ తుఫాన్ ఇన్నింగ్స్.. హాంగ్‌కాంగ్‌‌ ముందు బిగ్ టార్గెట్

Asia Cup 2025: ఒమర్జాయ్ తుఫాన్ ఇన్నింగ్స్.. హాంగ్‌కాంగ్‌‌ ముందు బిగ్ టార్గెట్

హాంగ్‌కాంగ్‌‌తో జరుగుతోన్న ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్‌లో రాణించింది. మంగళవారం (సెప్టెంబర్ 9) అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్లో పిచ్ పై ఆఫ్ఘనిస్తాన్ మొదట తడబడినా తర్వాత అద్భుతంగా పుంజుకుంది. ఓపెనర్ సెదికుల్లా అటల్ (52 బంతుల్లో 73:6 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టును ముందుండి నడిపించాడు. ఆల్ రౌండర్ అజమాతుల్లా ఓమర్జాయ్ (21 బంతుల్లో 53: 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. సీనియర్ ప్లేయర్ మహమ్మద్ నబీ (33)రాణించాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ తొలి ఓవర్ నుంచే ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. తొలి ఓవర్లో అటల్ మూడు ఫోర్లు బాదాడు. గత కొంతకాలం నుంచి ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న గర్భాజ్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులే చేసి మూడో ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లలోనే ఆఫ్ఘనిస్తాన్ కు మరో షాక్ తగిలింది. ఇబ్రహీం జద్రాన్ కేవలం ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు.  ఈ దశలో నబీతో కలిసి అటల్ జట్టు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. మూడో వికెట్ కు 51 పరుగులు జోడించిన తర్వాత నబీ 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. 

►ALSO READ | 2026 T20 World Cup Final: అహ్మదాబాద్‌లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. పాకిస్థాన్ తుది సమరానికి వస్తే మరో ప్లాన్

ఆ తర్వాత నాయబ్ 5 పరుగులేక ఔటైనా.. ఓమర్జాయ్ తన తుఫాన్ ఇన్నింగ్స్ తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ క్రమంలో అటల్ 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు అటల్ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే మరో ఎండ్ లో ఓమర్జాయ్ అదే పనిగా చెలరేగాడు. అతని విధ్వంసానికి 17 ఓవర్లో 25 పరుగులు.. 19 ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది. అటల్, ఓమర్జాయి ఐదో వికెట్ కు 82 పరుగులు జోడించి జట్టు 180 పరుగులకు చేర్చారు. తొలి 13 ఓవర్లలో 95 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్తాన్ చివరి 7 ఓవర్లలో 93 రాబట్టడం విశేషం. హాంగ్‌కాంగ్‌‌ బౌలర్లలో  కించిత్ షా, ఆయుష్ శుక్లా తలో రెండు వికెట్లు పడగొట్టారు.