2026 T20 World Cup Final: అహ్మదాబాద్‌లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. పాకిస్థాన్ తుది సమరానికి వస్తే మరో ప్లాన్

2026 T20 World Cup Final: అహ్మదాబాద్‌లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. పాకిస్థాన్ తుది సమరానికి వస్తే మరో ప్లాన్

2026లో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌కు ఫైనల్ వేదికగా దాదాపుగా ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కన్ఫర్మ్ కాగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఫైనల్ కు చేరుకోలేకపోతే టోర్నమెంట్ తుది సమరం అహ్మదాబాద్‌లో జరుగుతుంది. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్ కు చేరుకుంటే మాత్రం శ్రీలంకలోని కొలంబోలో ఫైనల్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

2026 వరల్డ్ కప్ కు 20 జట్లలో ఇప్పటివరకు 15 జట్లు అర్హత సాధించాయి. ఆతిధ్య దేశాలైన భారత్, శ్రీలంక నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధిస్తాయి. 2024 టీ20 వరల్డ్ కప్ లో సూపర్-8 కు అర్హత సాధించిన దేశాలు 2026 వరల్డ్ కప్ కు తమ బెర్త్ లు ఖాయం చేసుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌, యూఎస్‌ఏ, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ ఈ లిస్టులో ఉన్నాయి. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ సూపర్-8 కు అర్హత సాధించకపోయినా  ర్యాంకింగ్స్ పరంగా అర్హత సాధించాయి. దీంతో 20 జట్లలో క్వాలిఫై మ్యాచ్ లు ఆడకుండానే ఈ 12 టీమ్స్ 2026 వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి.

►ALSO READ | SA20 2026 auction: ఐపీఎల్‌కు నాలుగు రెట్లు డబ్బు.. సౌతాఫ్రికా టీ20 ఆక్షన్‌లో మార్కరం, బ్రెవిస్‌లకు కోట్ల వర్షం

అమెరికాస్ రీజినల్ క్వాలిఫైయర్‌లో కెనడా జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించిన 13వ జట్టుగా నిలిచింది. ఆ తర్వాత క్వాలిఫైయర్‌లో ఇటలీ, నెదర్లాండ్స్ అర్హత సాధించడంతో 15 జట్లు ఫిక్స్ అయ్యాయి. మిగిలిన 5 స్థానాల కోసం ఈస్ట్‌ ఏసియా పసిఫిక్‌ క్వాలిఫైయర్స్‌ నుంచి ఒక టీమ్‌, ఆసియా క్వాలిఫైయర్స్‌ నుంచి రెండు టీమ్స్‌, ఆఫ్రికా క్వాలిఫైయర్స్‌ టోర్నీ నుంచి రెండు టీమ్స్‌ అర్హత సాధించాల్సి ఉంది. 2026లో టీ20 తొలిసారి జట్లు టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి.