మోదీ ప్రకటనతో ములుగు జిల్లాలో హర్షాతిరేకాలు

మోదీ ప్రకటనతో ములుగు జిల్లాలో హర్షాతిరేకాలు
  • రూ.900 కోట్ల కేటాయింపుతో జోరందుకోనున్న నిర్మాణ పనులు
  • రాష్ట్ర ప్రభుత్వం స్థలం అప్పగించడమే తరువాయి
  • వైటీసీ భవన్‌‌లో తాత్కాలిక తరగతులకు లైన్​ క్లియర్

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: ములుగులో ఏర్పాటు చేయనున్న నేషనల్​ ట్రైబల్​ యూనివర్సిటీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఆదివారం పాలమూరు వేదికగా ట్రైబల్​ యూనివర్సిటీకి గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారక్క పేరు పెడ్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అలాగే యూనివర్సిటీ భవనాల నిర్మాణం, మౌలిక వసతులకు రూ.900 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. తొమ్మిదేళ్ల నాటి కల నెరవేరనుండడంతో గిరిజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని ప్రకటన నేపథ్యంలో త్వరలోనే ములుగు జిల్లా జాకారంలోని యూత్​ ట్రెయినింగ్​ సెంటర్ (వైటీసీ) భవన్‌‌లో టెంపరరీ క్లాసులు ప్రారంభం కానున్నాయి. నిర్మాణాలు పూర్తికాగానే కొత్త బిల్డింగ్‌‌లోకి తరగతులను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2017లో తొలి అడుగు

రాష్ట్ర విభజన టైంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ట్రైబల్​ యూనివర్సిటీల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. విభజన చట్టంలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లోనూ యూనివర్సిటీ ఏర్పాటుకు 2017లోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదే ఏడాది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జాయింట్​సెక్రటరీ సుఖ్​బీర్​సింగ్​ నేతృత్వంలోని కేంద్ర బృందం ములుగులో పర్యటించింది. గట్టమ్మ దేవాలయం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన స్థలాన్ని పరిశీలించి యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. 2018 డిసెంబర్​ 31న కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం సైతం స్థల పరిశీలన చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ములుగులోని వైటీసీ భవన్​లో తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం కేంద్రం రూ.10 కోట్లు కేటాయించింది.

ఫండ్స్​ రెడీ.. స్థల సేకరణే ఆలస్యం

యూనివర్సిటీ ఏర్పాటుకు 498.04 ఎకరాల ప్రభుత్వ భూమిని గట్టమ్మ దేవాలయం వద్ద కేటాయిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర సర్కారు ఇప్పటికీ 169.35 ఎకరాల భూమిని మాత్రమే గిరిజన శాఖకు అధికారికంగా అప్పగించింది. 213 ఎకరాల భూమి అటవీ శాఖ ఆధీనంలో ఉండగా బదలాయింపు కోసం అటవీ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. మరో 115 ఎకరాల భూమి అసైన్డ్​ భూములు రైతుల చేతుల్లో ఉంది. ఎకరానికి రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చినా రైతులు ససేమిరా అంటున్నారు. తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని లేదా పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. దీంతో భూ సేకరణ నిలిచిపోయింది. నిజానికి ఏపీతో పాటే 2019లోనే   ట్రైబల్​ యూనివర్సిటీని తాత్కాలిక భవనంలో ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. క్లాసుల ప్రారంభానికి ఎలాంటి టెక్నికల్​ అడ్డంకులు లేవని, సెప్టెంబర్​లో నోటిఫికేషన్​ జారీ చేస్తామని రాష్ట్ర సర్కారుకు నివేదిక పంపింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి​ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పటికీ క్లాసులు ప్రారంభం కాలేదు. నిజానికి ములుగు జిల్లా జాకారం వద్ద  యూనివర్సిటీ కోసం ఇప్పటి వరకు ఎంత స్థలం కేటాయించింది? ఇంకా ఎంత భూమి ఇవ్వాల్సి ఉంది? లాంటి వివరాలను ఇక్కడి ఆఫీసర్లు గోప్యంగా ఉంచుతున్నారు. తాజాగా యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.900 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికైనా భూ సేకరణను స్పీడప్​ చేసి, టెంపరరీ క్లాసుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్న డిమాండ్​ వ్యక్తమవుతోంది.