అఫ్గానిస్తాన్‌‌కు సౌతాఫ్రికా చెక్‌‌ .. 5 వికెట్ల తేడాతో గెలుపు..

అఫ్గానిస్తాన్‌‌కు సౌతాఫ్రికా చెక్‌‌  .. 5 వికెట్ల తేడాతో గెలుపు..

అహ్మదాబాద్‌‌: ఈ వరల్డ్‌‌ కప్‌‌లో ఓడిన రెండు మ్యాచ్‌‌ల్లో ఛేజింగ్‌‌లో తడబడిన సౌతాఫ్రికా ఎట్టకేలకు గాడిలో పడింది. వాన్‌‌ డర్‌‌ డసెన్‌‌ (95 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 76 నాటౌట్‌‌), డికాక్‌‌ (47 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 41) నిలకడగా ఆడటంతో.. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో ప్రొటీస్‌‌ 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌‌పై గెలిచింది. టాస్‌‌ గెలిచిన అఫ్గానిస్తాన్‌‌ 50 ఓవర్లలో 244 రన్స్‌‌కు ఆలౌటైంది. అజ్మతుల్లా ఒమర్‌‌జాయ్‌‌ (107 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 97 నాటౌట్‌‌) ఒంటరి పోరాటం చేశాడు. తర్వాత సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో 247/5 స్కోరు చేసింది. 

డికాక్‌‌, కెప్టెన్‌‌ బవూమ (23) తొలి వికెట్‌‌కు 64 రన్స్‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే రెండు రన్స్‌‌ తేడాతో ఈ ఇద్దరూ ఔట్‌‌ కావడంతో సఫారీ ఇన్నింగ్స్‌‌ తడబడింది. ఈ దశలో డసెన్‌‌ మెరుగ్గా ఆడాడు. అఫ్గాన్‌‌ పేస్‌‌–స్పిన్‌‌ కాంబినేషన్‌‌ను దీటుగా  ఎదుర్కొంటూ చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు. మార్‌‌క్రమ్‌‌ (25)తో మూడో వికెట్‌‌కు 50 రన్స్‌‌ జత చేసి ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టాడు. 

క్లాసెన్‌‌ (10) నిరాశపర్చినా, మిల్లర్‌‌ (24) ఫర్వాలేదనిపించాడు. ఐదో వికెట్‌‌కు 43 రన్స్‌‌ జత చేసి ఔట్‌‌ కావడంతో సౌతాఫ్రికా 182/5తో ఎదురీత మొదలుపెట్టింది. ఓ ఎండ్‌‌లో వికెట్లు పడినా.. రెండో ఎండ్‌‌లో బౌండ్రీలతో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసిన డసెన్‌‌కు పెహుల్‌‌క్వాయో (39 నాటౌట్‌‌) అండగా నిలిచాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌‌కు 65 రన్స్‌‌ జోడించి టీమ్‌‌ను గెలిపించారు. డసెన్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

సెంచరీ మిస్‌‌..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన అఫ్గాన్‌‌కు మంచి ఆరంభం దొరికినా.. మధ్యలో సఫారీ బౌలర్ల విజృంభణకు మిడిలార్డర్‌‌ కుప్పకూలింది. కానీ ఆల్‌‌రౌండర్‌‌ ఒమర్‌‌జాయ్‌‌ ఒంటరి పోరాటం చేసి మంచి టార్గెట్‌‌ను నిర్దేశించాడు. అయితే చివరి వరకు క్రీజులో ఉండి సూపర్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడిన అతను కెరీర్‌‌లో తొలి సెంచరీని అందుకోలేకపోయాడు. ఆఖరి ఓవర్‌‌లో లాస్ట్‌‌ మూడు బాల్స్‌‌లో మూడు రన్స్‌‌ చేయలేకపోయాడు. ఓపెనర్లు రహమానుల్లా గుర్బాజ్‌‌ (25), ఇబ్రహీం జద్రాన్‌‌ (15) తొలి వికెట్‌‌కు 41 రన్స్‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. 

కానీ నాలుగు రన్స్ తేడాలో ఈ ఇద్దరితో పాటు హష్మతుల్లా షాహిది (2) ఔట్‌‌ కావడంతో అఫ్గాన్‌‌ 45/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో ఒమర్‌‌జాయ్‌‌ నిలకడగా ఆడాడు. సఫారీ పేసర్లు కొయెట్జీ (4/44), ఎంగిడి (2/69), పెహుల్‌‌క్వాయో (1/36) దెబ్బకు మిగతా వారు పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. మధ్యలో స్పిన్నర్‌‌ కేశవ్‌‌ మహరాజ్‌‌ (2/25) కూడా టర్నింగ్‌‌తో ఆకట్టుకున్నాడు. అజ్మతుల్లాతో నాలుగో వికెట్‌‌కు 49 రన్స్‌‌ జోడించి రహమత్‌‌ షా (26) ఔట్‌‌ కావడంతో వికెట్ల పతనం మొదలైంది. ఇక్రామ్‌‌ అఖిల్‌‌ (12), మహ్మద్‌‌ నబీ (2), రషీద్‌‌ ఖాన్‌‌ (14) ఫెయిల్‌‌ కావడంతో అఫ్గాన్‌‌ 116/6 స్కోరుతో నిలిచింది. నూర్‌‌ అహ్మద్‌‌ (26) కాసేపు అండగా నిలిచి ఒమర్‌‌జాయ్‌‌తో ఏడో వికెట్‌‌కు 54 రన్స్‌‌ జత చేశాడు. చివర్లో ముజీబ్‌‌ (8), నవీన్‌‌ (2) నిరాశపర్చారు. 

సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్తాన్‌‌: 50 ఓవర్లలో 244 ఆలౌట్‌‌ (ఒమర్‌‌జాయ్‌‌ 97*, కోయెట్జీ 4/44, కేశవ్‌‌ 2/25), సౌతాఫ్రికా: 47.3 ఓవర్లలో 247/5 (డసెన్‌‌ 76*, డికాక్‌‌ 41, నబీ 2/35).