డీఆర్‌డీవోను పాతిపెట్టారు.. కాగ్ రిపోర్ట్‌‌పై కాంగ్రెస్ సీరియస్

డీఆర్‌డీవోను పాతిపెట్టారు.. కాగ్ రిపోర్ట్‌‌పై కాంగ్రెస్ సీరియస్

న్యూఢిల్లీ: మోడీ సర్కార్‌‌పై ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. కాగ్ ఆడిట్ ఆధారంగా ప్రభుత్వం మీద కాంగ్రెస్ విమర్శలు చేసింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) రిపోర్ట్ ప్రకారం రాఫెల్ ఎయిర్‌‌క్రాఫ్ట్ డీల్ కింద ఇండియాకు ఫ్రెంచ్ మ్యానుఫ్యాక్చర్స్ హై టెక్నాలజీ సదుపాయాన్ని అందివ్వాలి. ఈ మేరకు ఇండియాకు అవసరమైన టెక్నాలజీని అందిస్తామని 2015 సెప్టెంబర్‌‌లో కమిట్ అయిన డసాల్ట్ ఏవియేషన్, ఎంబీడీఏ ఇప్పటివరకు అందించకపోవడంతో కేంద్రంపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలకు దిగుతోంది.

డీఆర్‌‌డీవోకు కావాల్సిన టెక్నాలజీని డస్సాల్ట్ ఏవియేషన్, ఎంబీడీఏ అందించలేదంటూ అపోజిషన్ మండిపడింది. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. మేకిన్ ఇండియా కాస్త మేకిన్ ఫ్రాన్స్ అయ్యిందని సూర్జేవాలా దుయ్యబట్టారు. టెక్నాలజీ ట్రాన్స్‌‌ఫర్ కోసం డీఆర్‌‌డీవోను పాతిపెట్టారని, అయినా మోడీజీ మాత్రం అంతా కుశలమే అనేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీల్ ప్రకారం ఫ్రాన్స్ టెక్నాలజీని అందిస్తే కావేరీ జెట్ ఇంజిన్‌‌ను రూపొందించడంలో డీఆర్‌‌డీఏ బిజీ కానుంది. అలాగే ఫ్రెంచ్ టెక్నాలజీ ద్వారా లైట్ కంబాట్ ఎయిర్‌‌క్రాఫ్ట్ అయిన తేజస్ లాంటి వాటికి ఇంజన్లను తయారు చేయాలని భావిస్తోంది.