ఏఐ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో భారత్ ఇప్పుడు కేంద్ర బిందువుగా మారనుంది. AI రంగంలో గ్లోబల్ సౌత్ దేశాల్లోనే తొలిసారిగా నిర్వహిస్తున్న 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'కు వేదికగా రాజధాని ఢిల్లీ మారింది. ఫిబ్రవరి 16 నుండి 20 వరకు జరగనున్న 5 రోజుల సదస్సులో ప్రపంచ టెక్ రంగంలోని దిగ్గజాలు ఒకే వేదికపైకి రానుండటం చాలా పెద్ద విషయం. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్‌మాన్, ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్ వంటి దిగ్గజాలతో పాటు మైక్రోసాఫ్ట్, మెటా, ఆంత్రోపిక్, క్వాల్‌కామ్ సంస్థల ప్రతినిధులు సమ్మిట్‌లో కనిపించనున్నారు.
ఏఐ సమ్మిట్ లో కీలక కంపెనీల ప్రతినిధులు వీరే..
- సుందర్ పిచాయ్ – గూగుల్ (Google) సీఈఓ
- సామ్ ఆల్ట్‌మాన్ – ఓపెన్ ఏఐ (OpenAI) సీఈఓ
- జెన్సన్ హువాంగ్ – ఎన్విడియా (NVIDIA) అధినేత
- డారియో అమోడెయ్ – ఆంత్రోపిక్ (Anthropic) సీఈఓ
- డెమిస్ హసాబిస్ – గూగుల్ డీప్‌మైండ్ (Google DeepMind)
- బ్రాడ్ స్మిత్ – మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రెసిడెంట్
- అలెగ్జాండర్ వాంగ్ – మెటా (Meta) చీఫ్ ఏఐ సైంటిస్ట్
- క్రిస్టియానో అమన్ – క్వాల్‌కామ్ (Qualcomm) సీఈఓ
భారత్ ఎంచుకున్న ఈ 'ఏఐ సమ్మిట్' అంతర్జాతీయంగా ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం మన దేశంలో ఉన్న నైపుణ్యం కలిగిన హ్యూమన్ రిసోర్సెస్. సర్వీస్ ఎకానమీలో భారత్ కీలక పాత్ర పోషిస్తున్న వేళ తాము ఏఐపై చేసిన భారీ పెట్టుబడులను లాభసాటిగా మార్చుకోవడానికి టెక్ దిగ్గజాలకు భారత్ ఒక ప్రధాన మార్కెట్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు భారతదేశపు ఏఐ మౌలిక సదుపాయాల కోసం సుమారు 77.5 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.7లక్షల కోట్ల వరకూ పెట్టుబడికి సిద్ధమయ్యాయి. ముఖ్యంగా చైనా మార్కెట్ అమెరికా టెక్ కంపెనీలకు మూసుకుపోవడంతో.. భారత్ ఇప్పుడు వారి ఏకైక అతిపెద్ద ఆశ్రయంగా మారింది.
ఈ సమ్మిట్ కేవలం సాంకేతిక నిపుణులకు మాత్రమే పరిమితం కాకుండా.. ప్రపంచ రాజకీయ నేతలను కూడా ఆకర్షిస్తోంది. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ 'ఏఐ ఫర్ ఆల్' అంశంపై ప్రసంగించనుండగా.. భారత ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అనే మూడు ముఖ్యమైన సూత్రాల ఆధారంగా ఇది సాగనుంది. ఎడ్మినిస్ట్రేషన్, ఇన్నోవేషన్స్.. స్థిరమైన అభివృద్ధిలో ఏఐ పాత్రపై ఇక్కడ లోతైన చర్చలు జరగనున్నాయి.
ఈ మెగా ఈవెంట్‌లో 30కి పైగా దేశాల నుంచి సుమారు 300 మంది ఎగ్జిబిటర్లు పాల్గొని తమ ఏఐ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఏఐ అనేది కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా.. సామాన్యుల జీవితాల్లోకి.. భారీ పరిశ్రమల్లోకి ఏ విధంగా చొచ్చుకువస్తుందో ఈ 'ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో' ద్వారా చూపించబోతున్నారు. ప్రపంచ దేశాల మధ్య ఏఐ సహకారాన్ని పెంపొందించడంలో భవిష్యత్ టెక్నాలజీకి దిశానిర్దేశం చేయడంలో ఏఐ సమ్మిట్ ఒక మైలురాయిగా నిలవనుందని తెలుస్తోంది. ప్రపంచాన్ని ఏఐ ఎలా మార్చబోతుందనే విషయాన్ని ఒక శాంపిల్ రూపంలో సమ్మిట్ ఆవిష్కరించనుందని చెప్పుకోవాలి.
