కోల్‌బెల్ట్, వెలుగు : పూర్తిగా లేవలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి అంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రం వద్దకు రాగా.. సిబ్బంది ఓటర్ వద్దకు వెళ్లి ఓటు వేయించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగింది. మున్సిపాలిటీలోని 18వ వార్డుకు చెందిన ఇల్ల జయరాంచౌదరి లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఐదు నెలల కింద ప్రమాదం జరిగి వెన్నెముక, నాడీవ్యవస్థ దెబ్బతినడంతో మంచానికే పరిమితం అయ్యాడు.
అయినప్పటికీ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న తపనతో బుధవారం అంబులెన్స్‌లో రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలోని బూత్‌కు వచ్చాడు. విషయం తెలుసుకున్న పోలింగ్ సిబ్బంది స్వయంగా జయరాం చౌదరి వద్దకు వెళ్లి, వివరాలు పరిశీలించి ఓటు హక్కు కల్పించారు. ఈ ఘటన చూసిన పలువురు ఓటేసేందుకు వచ్చిన జయరాంను, స్వయంగా బయటకు వచ్చి ఓటేసేందుకు సహకరించిన పోలింగ్ సిబ్బందిని అభినందించారు.
