హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో తెలంగాణ చల్లబడింది. సిద్దిపేట జిల్లా ముస్త్యాలలో అత్యధికంగా 12.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో 11సెం.మీ, నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.4సెం.మీ వర్షం, మహబూబ్‌నగర్‌లో 7.5 సెం.మీ వర్షపాతం, నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో 6.2 సెం.మీ. వర్షపాతం, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తమొల్గరలో 11 సెంటీ మీటర్ల వర్షపాతం, పర్పల్లిలో 10, భూత్పూర్‌లో 10.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 8.8.. వనపర్తి జిల్లా అమరచింతలో 8.6.. మహబూబ్‌నగర్ టౌన్‌లో 7.5.. సిద్దిపేట జిల్లా అంగడ కిష్టాపూర్‌లో 6.5, నల్గొండ జిల్లా డిండిలో 6.2.. సంగారెడ్డి జిల్లా హత్నూరలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
నిజామాబాద్ దర్పల్లిలో 5.4.. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో 5, కామారెడ్డి జిల్లా దోమకొండలో 5, సదాశివనగర్‌లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. అకాల వర్షానికి కల్లాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోవడంతో రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని జిల్లాల్లో కల్లాల్లా పోసిన వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. ఖమ్మం నగరంలో వెంకటాయపాలెం, గోపాలపురం తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది.
గత వారం రోజులగా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఒక్కసారిగా ఖమ్మం నగరంలో వాతావరణం మారడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఖమ్మం నగరంలోని కొన్ని డివిజన్లో భారీ వర్షం నమోదు కాగా , మరికొన్ని డిజైన్లలో వర్షం లేకపోయినా వాతావరణ మార్పుతో చల్లబడ్డాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కేంద్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.
సిరిసిల్ల, వేములవాడ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మెదక్, సిద్దిపేట జిల్లాలో మంగళవారం రాత్రి నుంచే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో చెట్లు విరిగిపడ్డాయి. రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్ సిటీలో కూడా అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది.
