రూ.25 వేల కోట్లు ఏమవుతాయ్​? .. సెబీ దగ్గరున్న నిధులపై సస్పెన్స్​

రూ.25 వేల కోట్లు ఏమవుతాయ్​? .. సెబీ దగ్గరున్న నిధులపై సస్పెన్స్​

న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సుబ్రతా రాయ్‌‌‌‌ మంగళవారం రాత్రి మరణించడంతో, ఆయన కంపెనీ  నిధులపై సస్పెన్స్​ నెలకొంది. సెబీ ఖాతాలో సహారాకు చెందిన రూ.25వేల కోట్లకుపైగా నిధులు ఉన్నాయి. వీటి చెల్లింపు ఎలా అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. పోంజీ స్కీమ్‌‌‌‌లతో నిబంధనలను అతిక్రమిం చారని ఆరోపణలు రావడంతో రాయ్​ అనేక చట్టపరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్,  సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్​పై సెబీ కొరడా ఝుళిపించింది. 

దాదాపు 3 కోట్ల మంది పెట్టుబడిదారుల నుంచి బాండ్ల రూపంలో సేకరించిన డబ్బును తిరిగి చెల్లించాలని ఆదేశించింది.   సుప్రీంకోర్టు కూడా సెబీ ఆదేశాలను సమర్థించింది.  95 శాతం కంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు నేరుగా రీఫండ్ చేసినట్లు గ్రూప్ చెబుతూ వచ్చినప్పటికీ, వాళ్లకు తదుపరి రీఫండ్ కోసం సెబీ వద్ద రూ. 24 వేల కోట్లు డిపాజిట్ చేయాలని సహారాను కోరింది.  

సెబీ ఈ రెండు సహారా గ్రూప్ సంస్థల పెట్టుబడిదారులకు 11 సంవత్సరాలలో రూ.138.07 కోట్లు రీఫండ్​ చేసింది. రీఫండ్ల కోసం ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తం రూ.25 వేల కోట్లకు పైగా పెరిగింది.  మెజారిటీ బాండ్‌‌‌‌ హోల్డర్ల నుంచి క్లెయిమ్‌‌‌‌లు రాలేదు. గత ఆర్థిక సంవత్సరంలో సెబీ రీఫండ్ చేసిన మొత్తం కేవలం రూ. 7 లక్షలు పెరిగింది.

అయితే సెబీ -సహారా రీఫండ్ ఖాతాలలో బ్యాలెన్స్ ఏడాది కాలంలో రూ.1,087 కోట్లు పెరిగింది.  ఈ ఏడాది మార్చి 31 నాటికి 53,687 ఖాతాల నుంచి సెబీ 19,650 దరఖాస్తులను తీసుకుంది. మొత్తం రూ. 138.07 కోట్లను  17,526 దరఖాస్తుదారులకు చెల్లించారు. మిగిలిన దరఖాస్తులకు సంబంధించి తగిన సమాచారం దొరకడం లేదు.    జాతీయ బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం దాదాపు రూ. 25,163 కోట్లకు చేరింది.  వీటిపై సెబీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.