ఖలిస్తానీ లీడర్లకు ఎఫ్​బీఐ అలర్ట్.. నిజ్జర్ హత్య తర్వాత హెచ్చరించిన అధికారులు

ఖలిస్తానీ లీడర్లకు ఎఫ్​బీఐ అలర్ట్.. నిజ్జర్ హత్య తర్వాత హెచ్చరించిన అధికారులు
  • ఖలిస్తానీ లీడర్లకు ఎఫ్​బీఐ అలర్ట్
  • నిజ్జర్ హత్య తర్వాత హెచ్చరించిన అధికారులు
  • ‘ది ఇంటర్ సెప్ట్’ నివేదికతో వెలుగులోకి..

న్యూఢిల్లీ : కెనడాలో ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత అమెరికాలోని కొంత మంది ఖలిస్తానీ లీడర్లను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్​బీఐ) అలర్ట్​ చేసింది. జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు ది ఇంటర్​సెప్ట్ ఓ నివేదికలో పేర్కొంది. అమెరికాలో ఉన్న ఖలిస్తానీ లీడర్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లు ఎఫ్​బీఐ ఫోన్ చేసి అలర్ట్ చేసినట్లు ది ఇంటర్​సెప్ట్ వివరించింది. 

అమెరికా సిక్కుల కాకస్ కమిటీ కో ఆర్డినేటర్ ప్రీత్​పాల్ సింగ్ ‘ది ఇంటర్​సెప్ట్’​తో మాట్లాడారు. ‘‘ఇద్దరు ఎఫ్​బీఐ ఏజెంట్లు ఈ ఏడాది జూన్ చివర్లో మేము ఉంటున్న ఏరియాకు వచ్చారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. నన్ను చంపేందుకు ఎవరో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వచ్చినట్లు తెలిపారు. ఎవరి నుంచి ప్రాణ హాని ఉందో మాత్రం చెప్పలేదు. జాగ్రత్తగా ఉండాలన్నారు” అని వివరించాడు. 

ఇండియా నుంచే అని పక్కాగా చెప్పలేదు..

జూన్​లోనే కెనడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఖలిస్తానీ నేతలను హెచ్చరించినట్లు బ్రిటిష్ కొలంబియా గురుద్వారాస్ కౌన్సిల్ ప్రతినిధి మోనిందర్ సింగ్ తెలిపారు. ‘‘నిజ్జర్​కు కూడా ప్రాణ హాని ఉందని కెనడా అధికారులు ముందే చెప్పారు. కొందరు ఖలిస్తానీ లీడర్లను టార్గెట్ చేసినట్లు హెచ్చరించారు. అయితే, మమ్మల్ని చంపేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారని అడిగితే అధికారులు జవాబివ్వలేదు”అని మోనిందర్ సింగ్ చెప్పాడు.

నిజ్జర్​కు ప్రాణ హాని ఉందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు హెచ్చరించినట్లు వివరించారు.  ఖలిస్తానీ లీడర్లతో సంబంధాలు కొనసాగిస్తున్న వారిని టార్గెట్ చేశారని సమాచారం అందిందని ఇన్సాఫ్ ఎన్జీవో  కో డైరెక్టర్ సుఖ్మన్ ధామి తెలిపారు.