నాలుగు రోజుల్లో 192 బస్సులపై కేసులు

నాలుగు రోజుల్లో 192 బస్సులపై కేసులు
  • ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కంటిన్యూ

హైదరాబాద్, వెలుగు: కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటన తర్వాత తెలంగాణ ఆర్టీఏ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. గత నాలుగు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి  ఉమ్మడి జిల్లాల పరిధిలోని పలు ట్రావెల్స్ బస్సులను వరుసగా చెక్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ వెళ్లే పలు ప్రైవేట్ బస్సులలో  ప్రయాణికుల భద్రతాపరమైన లోపాలను గుర్తిస్తున్న అధికారులు వాటిపై కేసులు నమోదు చేస్తున్నారు.

ఇక నిబంధనలను పూర్తిగా పట్టించుకోని బస్సులను ఏకంగా సీజ్ చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి 28 వరకు ఈ రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 192 బస్సులపై కేసులు నమోదు చేసిన ఆర్టీఏ అధికారులు, రూ. 4. 55 లక్షలను ఫైన్ ద్వారా వసూలు చేశారు. నిబంధనలను గాలికొదిలేసిన 8 బస్సులను సీజ్ చేశారు.

సీట్లను స్లీపర్ గా మార్చడం, నిబంధనలకు విరుద్ధంగా బస్సుల్లో మార్పులు, చేర్పులు చేయడం, ఫైర్ సేప్టీ ప్రమాణాలు పాటించకపోవడం, ఫస్ట్ ఎయిడ్ కిట్ లు లేకపోవడం, టూరిస్టు పర్మిట్ తో ప్యాసింజర్లను ఎక్కించుకొని కమర్షియల్ వ్యాపారం చేయడం, ప్యాసింజర్ల లిస్టు లేకపోవడం వంటి కారణాలతో ఆర్టీఏ అధికారులు ఈ కేసులు నమోదు చేశారు. మంగళవారం 49 బస్సులపై కేసులు నమోదు చేసిన అధికారులు, మూడు బస్సులను సీజ్ చేసి రూ. 1. 50 లక్షలను ఫైన్ రూపంలో వసూలు చేశారు.