
హైదరాబాద్: ‘ఆస్కార్’ (oscars 2023) అవార్డు సాధించిన అనంతరం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. మార్చి 17వ తేదీ తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న డైరెక్టర్ రాజమౌళి (Rajamouli), ఆయన సతీమణి రమ, సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani), ఆయన సతీమణి వల్లి, కార్తికేయ, కాలభైరవ, శ్రీసింహాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
రాజమౌళి, కీరవాణితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం రద్దీగా మారింది. కట్టు దిట్టమైన భద్రత నడుమ కీరవాణి, రాజమౌళి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం సంతోషంగా ఉందని రాజమౌళి, కీరవాణి తెలిపారు. మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌తో మాట్లాడేందుకు కొందరు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా.. ‘జైహింద్’ అంటూ రాజమౌళి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.