
సీజేఐపై షూ దాడి యత్నం ఘటనపై సుప్రీం జడ్జిల కామెంట్లు
అడ్వకేట్ రాకేశ్ కిశోర్ పై క్రిమినల్ చర్యలకు ఏజీ అనుమతి
న్యూఢిల్లీ: సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించిన అడ్వకేట్ రాకేశ్ కిశోర్‌పై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గురువారం అటార్నీ జనరల్ (ఏజీ) పోలీసులకు అనుమతి ఇచ్చారు. ఏజీ ఆదేశాల నేపథ్యంలో రాకేశ్ కిశోర్‌పై క్రిమినల్ కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద చర్యలకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడు సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ ద్విసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
ఈ నేపథ్యంలో ధర్మాసనం కీలక కామెంట్లు చేసింది. ‘‘ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే దానంతట అదే ఆగిపోతుంది. లేకుంటే.. సోషల్ మీడియాలో చర్చలు సాగుతాయి. అలాగే న్యాయవ్యవస్థపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది’’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి అభిప్రాయపడ్డారు. ‘‘ఈ ఘటనలో సీజేఐ చాలా ఉదారంగా స్పందించారు.
ఇలాంటి ఘటనలు సంస్థను ప్రభావితం చేయవు. ఇది కొత్త వివాదాలకు దారితీయొచ్చు. కోర్టులో మన ప్రవర్తనే ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తుంది. ఓ బాధ్యతలేని పౌరుడి చర్యగా పరిగణించి సీజేఐ దీన్ని పట్టించుకోలేదు. దీన్ని పైకి తేవడం సమయాన్ని వృథా చేయడమే. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అల్గోరిథమ్స్ ఆధారంగా పనిచేస్తాయి.
ప్రజలు వాటికి బానిసలుగా మారిపోయారు. మనం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నామనుకుంటాం, కానీ.. నిజానికి మనమే ఆ ప్లాట్‌ఫారాల ఉత్పత్తులం’’ అని బెంచ్ తెలిపింది.
‘సర్’లో ఎలాంటి తప్పులు జరగలేదు: ఈసీ
బిహార్ లో చేపట్టిన ఓట్ల సవరణ ప్రక్రియ (సర్) అక్యురేట్గా జరిగిందని, రాజకీయ పార్టీలు, ఎన్జీవోలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్ వివరించింది. ఫైనల్ ఎలక్టోరల్ జాబితాను ఇప్పటికే రిలీజ్ చేశామని తెలిపింది. తన పేరు అకారణంగా ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారంటూ ఇప్పటిదాకా ఒక్క ఓటర్ కూడా అప్పీల్ చేయలేదని గుర్తు చేసింది.
సర్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు జరగలేదని వివరించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి జరిపిన విచారణలో ఎన్నికల కమిషన్ తన వాదనలు వినిపించింది. ఎన్జీవోలు, పొలిటికల్ పార్టీ నేతలంతా తమ రాజకీయ లబ్ధి కోసమే సర్ కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశారని తెలిపింది.
కాగా, ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్‌లో టైపోగ్రాఫికల్ ఎర్రర్లు, ఇతర తప్పులను సరిచేయాలని ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది.
ఎయిరిండియా విమాన ప్రమాదంపై పిటిషన్..
అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై విచారించేందుకు కోర్ట్ మానిటర్డ్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ తండ్రి పుష్కరాజ్ సబర్వాల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలెట్స్ (ఎఫ్‌ఐపీ) కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తులో విశ్వసనీయత, పారదర్శకత లోపించిందని ఆరోపించారు.