మళ్లీ ‘ఉమ్టా’యాక్టివ్.. చురుగ్గా పనిచేసేలా రాష్ట్ర సర్కార్ ప్లాన్

మళ్లీ ‘ఉమ్టా’యాక్టివ్.. చురుగ్గా పనిచేసేలా రాష్ట్ర సర్కార్ ప్లాన్
  • కొత్త డైరెక్టర్​గా జీవన్​బాబు నియామకం
  • సిటీ ట్రాఫిక్​ప్రాబ్లమ్స్ పై త్వరలో కమిటీ భేటీ
  • గత బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం
  • కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పునరుద్ధరణకు చర్యలు 

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​హైదరాబాద్​లో ట్రాఫిక్​సమస్యల పరిష్కారంతో పాటు భవిష్యత్ లో ట్రాన్స్ పోర్ట్  అంచనాలు రూపొందించే అర్బన్​మెట్రోపాలిటన్​ట్రాన్స్​పోర్ట్​అథారిటీ(ఉమ్టా) మళ్లీ యాక్టివ్ కానుంది. వివిధ శాఖలతో కలిసి కో – ఆర్డినేషన్ తో ఏర్పాటైన ఉమ్టా కమిటీ ఇక ముందు చురుగ్గా వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ రూపొందిస్తోంది. కొన్నేండ్ల నుంచి స్తబ్దుగా ఉండగా... మళ్లీ పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఉమ్టాను గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరించే కమిటీలో సిటీలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. 

ఆయా విభాగాలను సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్​సమస్యలకు  కమిటీ పరిష్కారం చూపుతుంది. భవిష్యత్​లో  బెస్ట్  ట్రాన్స్​పోర్ట్​ పాలసీ కూడా రూపొందిస్తుంది. దీంతో  ప్రభుత్వం ప్రత్యేకంగా ఉమ్టాను మళ్లీ కీలకంగా వినియోగించుకోవాలని నిర్ణయించించింది. ఇందులో భాగంగానే  ఖాళీగా ఉన్న  డైరెక్టర్​పోస్టును భర్తీ చేసింది. ఢిల్లీ డెవలప్​మెంట్​అథారిటీ డైరెక్టర్​జీవన్​బాబును (ఫారెన్​సర్వీసుల కింద) అంతర్రాష్ట్ర డిప్యూటేషన్​పై తీసుకొచ్చి నియమించింది. ఇకనుంచి ఉమ్టా మరింత సమర్థవంతంగా పనిచేస్తూ సిటీ ట్రాఫిక్​వ్యవస్థను భవిష్యత్ కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోనుంది. 

మరింత చురుగ్గా ఉండేలా..

కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఉమ్టాకు కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్లీ యాక్టివ్ లోకి తెచ్చింది. దీంతో హెచ్ఎండీఏలోని ప్రత్యేక విభాగమైన ఉమ్టా మరింత చురుకుగా వ్యవహరించనుంది. ఉమ్టా ప్రత్యేక కమిటీలో డైరెక్టర్ తో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్వీనర్ గా,  సిటీలోని కీలక శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, పోలీస్, ఆర్టీఏ, ఆర్టీసీ, మెట్రోరైల్, ఆర్అండ్ బీ వంటి శాఖలన్నీ ఉమ్టా కింద పనిచేస్తాయి. దీని పరిధిని జీహెచ్ఎంసీతో పాటు మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి ప్రాంతాలను కలిపి విస్తరించారు. 

త్వరలోనే భేటీ కానున్న ఉమ్టా కమిటీ   

సిటీలో ట్రాఫిక్  ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేందుకు, భవిష్యత్ లో బెస్ట్ ట్రాన్స్ పోర్ట్ పాలసీ అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఉమ్టాకు డైరెక్టర్ గా జీవన్ బాబును నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మూడేండ్ల పాటు పదవిలో కొనసాగుతారు. హెచ్ఎండీఏలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయనకు ప్రభుత్వం ప్రత్యేక బాధ్యతలు ఇచ్చే చాన్స్ ఉంది. దాదాపు రెండేండ్లుగా ఉమ్టా కమిటీ భేటీ కావడం లేదు. దీంతో ఇకముందు మరింత చురుకుగా పనిచేసేలా అధికారులు ప్లాన్ రూపొందించారు. తద్వారా ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రత్యేకంగా కమిటీ భేటీ అవుతుంది. 

సిటీలో ట్రాఫిక్, ట్రాన్స్ పోర్ట్ సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. కమిటీ సూచనల మేరకు ఆయా శాఖలు పనులు చేపట్టాలి. ప్రమాణాలతో కూడిన పనులను చేసేందుకు గతంలోనే ఉమ్టా ద్వారా ట్రాఫిక్ మేనేజ్ మెంట్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీతో ట్రాఫిక్  సిగ్నలింగ్, ట్రాన్స్ పోర్టేషన్ అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్టా యాక్టివ్ అయితే తద్వారా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడుతుంది. అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ, పార్కింగ్ పాలసీ, ఉత్తమ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, నిధుల సేకరణ, ప్రమాణాలతో కూడిన పనుల నిర్వహణకు చాన్స్ ఉంటుందని అధికారులు తెలిపారు.