సింగరేణిలో టీబీజీకేఎస్​కు ఎదురుగాలి : ఐఎన్టీయూసీ

సింగరేణిలో టీబీజీకేఎస్​కు ఎదురుగాలి : ఐఎన్టీయూసీ
  • కాంగ్రెస్​గెలుపుతో ఫుల్​జోష్​లో ఐఎన్టీయూసీ
  • ఈ నెల 27న ‘గుర్తింపు సంఘం’ ఎన్నికలు
  • టీబీజీకేఎస్​కు మైనస్​గా నేతల అక్రమాలు

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్(తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం)కు ఈసారి ఎదురుగాలి తప్పేలా లేదు. ఇటీవల వచ్చి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. కోల్​బెల్ట్ లోని ఒక్క అసెంబ్లీ స్థానం మినహా మిగిలిన అన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీనే నెగ్గింది. బీఆర్ఎస్  ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వారసత్వ ఉద్యోగాల కల్పన, ఇతర అంశాలేవీ ఓట్లు తేలేకపోయాయి. పైగా టీబీజీకేఎస్ నేతల అక్రమాలు, పైరవీలు, దందాలు, సింగరేణి సంస్థలో మితిమీరిన ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు రాజకీయ జోక్యం, గుర్తింపు సంఘం ఎన్నికల వాయిదాల పర్వం, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వంటి అంశాలు గులాబీ పార్టీ అభ్యర్థుల ఓటమిని శాసించాయి. మెజార్టీ సింగరేణి కార్మికులంతా హస్తం గుర్తుకే జై కొట్టారు. కోల్​బెల్ట్​లోని 11 నియోజకవర్గాల్లో 9 చోట్ల కాంగ్రెస్, ఒకచోట మిత్రపక్షమైన సీపీఐని గెలిపించారు. బీఆర్ఎస్​కు ఒక్క సీటు మాత్రమే దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ​ప్రభుత్వం ఏర్పడటంతోపాటు, కోల్​బెల్ట్​లోని దాదాపు అన్ని స్థానాలు కైవడం చేసుకోవడంతో కాంగ్రెస్ ​అనుబంధ ఐఎన్టీయూసీలో జోష్​ నింపింది. గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని ఆ సంఘం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐఎన్టీయూసీ చివరిగా 2003లో గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచింది.

తీవ్ర వ్యతిరేకత

టీబీజీకేఎస్ లీడర్లు ప్రతి పనికి రేటు పెట్టడం, పైరవీ లేనిదే గనుల్లో ఏ చిన్న పని కాదనే దుస్థితికి తీసుకొచ్చారని కార్మికులు ఆరోపిస్తున్నారు. 2014, 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా, 2012, 2017లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్​కు కార్మికులు పట్టం కట్టారు. అయితే 2012 నుంచి టీబీజీకేఎస్ ​నేతల అవినీతి, అక్రమాలు, దందాలు మొదలయ్యాయి. కారుణ్య నియామకాల్లో ఆరోగ్యంగా ఉన్నవారు అన్​ఫిట్ కావడం, తీవ్ర అనారోగ్యంతో పనిచేయలేని వారు డబ్బు ఇస్తే ఫిట్​చేయడం, ఓసీపీలు, సర్ఫేస్​డిపార్ట్​మెంట్లలో పనిచేసేలా ఆర్డర్స్ ఇప్పించడం చేస్తూ వచ్చారు. పిట్​ నుంచి ఏరియా స్థాయి వరకు లీడర్లు నిత్యం మస్టర్లు పడ్డాక డ్యూటీలు ఎగ్గొట్టి, బీఆర్ఎస్​ఎమ్మెల్యేలతో కలిసి తిరిగేవారు. కార్మికుల సమస్యలను పెద్దగా పట్టించుకోలేదు. మందమర్రి ఏరియా లాంటి ప్రాంతాల్లోని వందలాది ఖాళీ క్వార్టర్లను తమ అనుచరులు, అనుకూలంగా ఉన్న వారికి కట్టబెట్టి డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏరియా వైస్​ప్రెసిడెంట్ ఏకంగా సింగరేణి క్వార్టర్లను కూల్చి, సొంతిల్లు కట్టుకోవడాన్ని అప్పటి జీఎం తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అప్పటి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వైస్​ప్రెసిడెంట్​కు మద్దతుగా నిలుస్తూ, జీఎంను బదిలీ చేయించారని ఆరోపణలు వచ్చాయి. అన్​ఫిట్ అయి, వారసులకు ఉద్యోగాలు ఇప్పించుకున్న లీడర్లే గనులపై తిరుగుతూ పెత్తనం చెలాయించడాన్ని సర్వీసులో ఉన్న కిందిస్థాయి నాయకులకు  మింగుడుపడలేదు. మందమర్రి ఏరియాలో ఎమ్మెల్యే పీఏ పేరుతో సిఫార్సు లెటర్లు, సింగరేణి ఆఫీసర్లపై ఒత్తిళ్లు తీసుకొచ్చి వందలాది ఖాళీ క్వార్టర్లను పార్టీ, యూనియన్​లీడర్లు, అనుచరులకు కట్టబెట్టారు. దీంతో సీనియర్, అర్హులైన సింగరేణి కార్మికులకు క్వార్టర్లు దక్కకుండా పోయాయి. సింగరేణి ఆఫీసర్లతో చెప్పించి కరెంట్, నీళ్లు కట్ చేయించి క్వార్టర్లను లీడర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందారం, కళ్యాణిఖని, శ్రీరాంపూర్​, రామకృష్ణాపూర్​వంటి ఓసీపీలు, జైపూర్​పవర్​ప్లాంట్​లో బాల్క సుమన్ ​సిఫార్సు లెటర్లు, పైరవీలతో ఉపాధి కల్పించడాన్ని కార్మికవర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.

ఓటమి భయంతో ఎన్నికలు వాయిదా

టీబీజీకేఎస్ లీడర్ల అవినీతి, అక్రమాలతో యూనియన్ ఉనికికే నష్టమని భావించిన బీఆర్ఎస్​హైకమాండ్​సింగరేణి ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇచ్చింది. లాభాల వాటా, పాలసీ విషయాలపై యూనియన్​లీడర్లను కాదని నేరుగా సీఎం, ఎమ్మెల్యేలు యాజమాన్యంతో చర్చించారు. 2017లో టీబీజీకేఎస్ రెండేళ్ల కాలపరిమితితో విజయం సాధించగా, తర్వాత పదవీ కాలాన్ని నాలుగేళ్లకు పెంచాలని టీబీజీకేఎస్​కోర్టును ఆశ్రయించింది. కోర్టు నాలుగేళ్లకు పొడిగించగా, పదవీ కాలం పూర్తయినా ఎన్నికలు నిర్వహించలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తే ఆ ప్రభావం ఆరు జిల్లాల్లోని 11 అసెంబ్లీ స్థానాలపై పడుతుందనే భయంతో బీఆర్ఎస్​ ఎన్నికలను వాయిదా వేయిస్తూ వచ్చింది. కాలపరిమితి ముగిసినా టీబీజీకేఎస్​గుర్తింపు హోదాలో కొనసాగడంపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి పెంచింది. పైగా కోల్​బెల్ట్ ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులకు సింగరేణిలో ప్రొటోకాల్​వర్తింపజేయడం, ఏటా రూ.2కోట్ల చొప్పున అభివృద్ధి కోసం ఫండ్స్​కేటయించడం, సింగరేణి ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సిన డీఎంఎఫ్​టీ, సీఎస్​ఆర్ ఫండ్స్​ను కేసీఆర్ కుటుంబసభ్యుల నియోజకవర్గాలకు మళ్లించి దుర్వినియోగానికి పాల్పడటం వంటి చర్యలపై కార్మికులు గుర్రుగా ఉన్నారు.  దీంతో ఈసారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్​కు ఓటమి తప్పదని సింగరేణిలో బహిరంగంగా చెప్పుకుంటున్నారు.