బొగ్గు గనుల వేలంపై భగ్గుమన్న యూనియన్లు

బొగ్గు గనుల వేలంపై భగ్గుమన్న యూనియన్లు
  •        సింగరేణి వ్యాప్తంగా బొగ్గు బాయిల వద్ద ఆందోళన
  •       నల్లబ్యాడ్జీలతో నిరసనలు ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు
  •       రాష్ట్రంలో అన్ని కోల్​మైన్స్​సింగరేణి సంస్థకే కేటాయించాలని డిమాండ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బొగ్గు గనుల వేలంపై యూనియన్లు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోల్​మైన్స్​విష యంలో అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ సింగరేణివ్యాప్తంగా కార్మిక సంఘాలు శుక్రవారం నిరసన తెలిపాయి. తెలంగాణలోని నాలుగు కోల్​ బ్లాక్​లను సింగరేణికే అప్పగించాలంటూ కార్మిక సంఘాల నేతలు డిమాండ్​ చేస్తూ బొగ్గు బాయిలపై నల్లబ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 

హెడ్డాఫీస్​తో పాటు ఏరియా, సెంట్రల్​ వర్క్​షాప్​, పలు డిపార్ట్​మెంట్స్​, మైన్స్​ వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని కేంద్రం తీరును నిరసించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ లీడర్లు వంగా వెంకట్​, ఎస్​వి. రమణమూర్తి, క్రిష్టఫర్​, అనంతలక్ష్మి, మల్లికార్జున్​. మందా నర్సింహరావు, విజయగిరి శ్రీనివాస్​, రాజారావు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

మంచిర్యాల జిల్లాలో..

కోల్​బెల్ట్​: 60 బొగ్గు బ్లాక్​లను బహిరంగ వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు కేటాయించేందుకు కేంద్రం తీసుకొన్న నిర్ణయం వల్ల ప్రభుత్వ బొగ్గు పరిశ్రమలు నిర్వీర్యమయ్యే ప్రమాదముందని వివిధ కార్మిక సంఘాలు ఆరోపించాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్​, బెల్లంపల్లి ఏరియాల్లోని అండర్​గ్రౌండ్​బొగ్గు గనులు, ఓపెన్​కాస్ట్​ మైన్లు, డిపార్ట్​మెంట్లపై సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్​, టీబీజీకేఎస్​, ఐఎఫ్​టీయూ, ఏఐఎఫ్​టీయూ తదితర సంఘాలు నిరసన తెలిపాయి. 

సంఘాల లీడర్లు, కార్యకర్తలు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించారు. మందమర్రి ఏరియా కేకే-5 బొగ్గు గనిపై హెచ్​ఎంఎస్​, ఇతర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశాయి. సింగరేణి జీఎంలు, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.  కార్మిక సంఘాల లీడర్లు అక్బర్​అలీ, సలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్​, రియాజ్​ అహ్మద్, టి.శ్రీనివాస్​, వెంకటస్వామి, శంకర్​రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని శ్రావణపల్లి గనిని వేలం నుంచి తొలగించాలని, అన్ని గనులను  బేషరతుగా సింగరేణికి కేటాయించాలన్నారు.

 సింగరేణిని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకే కేంద్రం కుట్రపూరితంగా బొగ్గు బ్లాక్​ల వేలం ప్రక్రియను తీసుకువచ్చిందన్నారు. కేంద్రం నిర్ణయంతో ప్రభుత్వ రంగ బొగ్గు పరిశ్రమలు నిర్వీర్యమవుతాయన్నారు. బొగ్గు బ్లాక్​లు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తే కార్మిక హక్కులు,  ఉద్యోగ భద్రత ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం గుజరాత్ మినరల్ డెవలప్​మెంట్ ​కార్పొరేషన్​కు నేరుగా బొగ్గు బ్లాక్​లను ఎలాగైతే అలాట్​ చేసిందో, అదే విధంగా సింగరేణికి బొగ్గు బ్లాక్​లు కేటాయించాలన్నారు. కేంద్రం దుర్మార్గంగా తలపెట్టిన వేలంలో పాల్గొనకుండా నేరుగా సింగరేణికే ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు. సింగరేణి  బొగ్గు బ్లాక్​లను వేలంలో ఉంచడాన్ని అడ్డుకోవాల్సిన కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఏకంగా హైదారాబాద్​ వేదికగా వేలం నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడం కుట్రలో భాగమన్నారు.  

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో..

గోదావరిఖని :  రామగుండం రీజియన్​ పరిధిలోని గని కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి డ్యూటీలకు హాజరయ్యారు. పలువురు లీడర్లు మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికి మాత్రమే కేటాయించాలని డిమాండ్​ చేశారు. వేలంలో సింగరేణి పాల్గొనవద్దని, పాల్గొంటే ప్రైవేటీకరణను అంగీకరించినట్టు అవుతుందన్నారు. సీఐటీయూ బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, తోట నరహరి రావు, జేల్లా గజేంద్ర, దాసరి సురేశ్​ పాల్గొన్నారు. అలాగే, సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక సమావేశం గోదావరిఖనిలోని హెచ్ఎంఎస్ ​యూనియన్​ ఆఫీస్​లో జరిగింది. 

జులై 3న హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో మేధావులు, ట్రేడ్ యూనియన్ల లీడర్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని, ఆ లోపు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపై గేట్​ మీటింగ్​లు జరపాలని నిర్ణయించారు. సింగరేణి కార్మిక సంఘాల లీడర్లు రియాజ్​ అహ్మద్​, జె.నారాయణ, ఐ.కృష్ణ, ఇ.నరేశ్​, కామెర గట్టయ్య, కుమారస్వామి, జి.రాములు, రామకృష్ణ, ఏడుకొండలు పాల్గొన్నారు.