సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ రణరంగం

 సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ రణరంగం
  • స్టేషన్​లోకి దూసుకొచ్చిన వేల మంది నిరసనకారులు
  • పెట్రోల్​ చల్లి నాలుగు రైళ్లకు నిప్పు.. షాపులు, ఫర్నిచర్​ ధ్వంసం
  • నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసుల కాల్పులు
  • ఒకరు మృతి.. 14 మందికి గాయాలు
  • మృతుడు రాకేశ్​ ఫ్యామిలీకి 25 లక్షల ఎక్స్​గ్రేషియా: కేసీఆర్​

‘అగ్నిపథ్​’ మంటలు సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​కు అంటుకున్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6  గంటల వరకు స్టేషన్​ అట్టుడికింది. అగ్నిగుండంలా మారింది. సైన్యంలో నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్​ స్కీంను వ్యతిరేకిస్తూ  వేల మంది అభ్యర్థులు ఉదయం ఒక్కసారిగా స్టేషన్​లోకి దూసుకువచ్చారు. నాలుగు రైళ్లకు నిప్పు పెట్టారు. కట్టెలు, రాడ్లు, రాళ్లతో అక్కడి షాపులపై దాడులు చేశారు. పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు చనిపోయాడు.

హైదరాబాద్, వెలుగు: ఆర్మీ అభ్యర్థుల ఆందోళనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. అగ్నిపథ్​ స్కీంను నిరసిస్తూ శుక్రవారం ఉదయం వాళ్లంతా స్టేషన్​కు చేరుకున్నారు. తొలుత స్టేషన్​ ముందు తలపెట్టిన ఆందోళన.. తర్వాత లోపలికి మారింది. ప్రయాణికుల్లా ప్లాట్​ఫాం ​పైకి  చొచ్చుకు వచ్చి దాడికి పాల్పడ్డారు. అగ్నిపథ్ ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను ఎప్పటిలాగే  నిర్వహించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నాలుగు రైళ్లకు నిప్పు పెట్టారు. కొన్ని బోగీలు రాళ్ల దాడిలో ధ్వంసమయ్యాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వరంగల్ జిల్లా దబీర్​పేట్​కు చెందిన రాకేశ్(18) బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. మరో 14 మంది గాయాలపాలయ్యారు. వాళ్లను గాంధీ హాస్పిటల్​కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. నిరసనకారుల రాళ్ల దాడిలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ హఠాత్​ పరిణామంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. తమ లగేజీని అక్కడే వదిలేసి భయంతో పరుగులు తీశారు. రైళ్లకు నిప్పంటించడంతో స్టేషన్​ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ దాడిలో హౌరా వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ధ్వంసమైంది. అజంతా ఎక్స్ ప్రెస్, దర్బంగా రాజ్ కోట్ ఎక్స్​ప్రెస్ తోపాటు ఓ ఎంఎంటీఎస్​ రైలుకు కూడా నిరసనకారులు 
నిప్పుపెట్టారు. అక్కడి క్యాంటీన్లు, స్టాళ్లు, టికెట్ కౌంటర్లను ధ్వంసం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం ఆరు వరకు సుమారు 10 గంటల పాటు ఆందోళనలతో సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ అట్టుడికింది. రూ.20 కోట్ల రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. 

ఉదయం తొమ్మిది గంటల సమయం.. సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లోని మొదటి నంబరు ప్లాట్​ఫాంపైకి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ వచ్చి 10 నిమిషాలైంది. మరో 10 నిమిషాల్లో హౌరా బయల్దేరాల్సిన ఆ రైలుపై నిరసనకారులు మూకుమ్మడి దాడికి దిగారు. కేవలం 10 నిమిషాల్లోనే వాతావరణం పూర్తిగా మారిపోయింది. తొమ్మిది నుంచి 11 గంటల వరకు రెండు గంటల పాటు... అక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈస్ట్ కోస్ట్, దర్బంగా రైళ్ల ముందు బైఠాయించిన నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు ఆర్పీఎఫ్ తోపాటు స్థానిక పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దర్బంగా ఎక్స్ ప్రెస్ రైల్లో తరలించడానికి ప్లాట్​ఫాం పక్కన సిద్ధంగా ఉంచిన రెండు బైక్​లు,  ఇతర ఫర్నిచర్​ను నిరసనకారులు తగలబెట్టారు. 

నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు మొదట లాఠీచార్జ్​ చేశారు. దాంతో నిరసనకారులు చెల్లాచెదురయ్యారు. కొంత సేపటికి వారు మరోసారి రైల్వే ట్రాక్ పైకి చేరుకొని ట్రాక్​పై ఉన్న రాళ్లను తీసుకుని పోలీసులపైకి విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైల్వే డీజీ సందీప్ శాండిల్య స్పాట్​కు చేరుకున్నారు. రెండుసార్లు గాల్లోకి కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్ సిబ్బంది.. ఆ తర్వాత నిరసనకారులపైకి తుపాకులు ఎక్కుపెట్టారు. అయినా నిరసనకారులు తగ్గలేదు. పోలీసులు కాల్పుల వల్ల ఓ యువకుడి చెవి నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.  ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు నిరసనకారులు గాయపడ్డారు. మరోవైపు ఒకరిద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు మొత్తం 15 రౌండ్ల కాల్పులు జరిపారు.

వణికిపోయిన ప్రయాణికులు
దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఈస్ట్​ కోస్ట్​ రైల్లో కూర్చుని వస్తువులు సర్దుకునే సమయంలో నిరసనకారులు రైలు అద్దాలు పగులగొట్టడం మొదలు పెట్టారు. బోగీల్లో ఉన్న పిల్లాపాపలు, వృద్ధులు, మహిళలు భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో.. ఎక్కడి నుంచి ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపారు. నిరసనకారులు ప్లాట్ ఫాంపైనే ఉండి దాడికి పాల్పడటంతో ప్రయాణికులకు ట్రైన్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తర్వాత ప్రయాణికులంతా బోగీల నుంచి దిగి వెళ్లిపోయే వరకు నిరసనకారులు కాస్త ఆగి.. తర్వాత తమ ఆగ్రహాన్ని  రైలుపై చూపించారు. ప్రయాణికుల్లో కొంతమంది తమ సామాన్లను అక్కడే వదిలేసి పోయారు. 
ఎక్కడికక్కడ ఆగిన రైళ్లు
రైల్వే శాఖ అధికారులు  91 రైళ్లను రద్దు చేశారు. ఎంఎంటీఎస్​, మెట్రో రైల్​ సర్వీసులను నిలిపివేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఒక్క రైలు కూడా కదల్లేదు. హైదరాబాద్​లోని నాంపల్లి, కాచిగూడ స్టేషన్లకు భద్రత పెంచారు. సిటీకి వచ్చే పలు రైళ్లను వరంగల్​, మహబూబ్​నగర్​ తదితర స్టేషన్లలో ఆపేశారు. రైల్వే స్టేషన్​లో జరుగుతున్న సంఘటనలతో అక్కడికి సిటీ బస్సులు రాకుండా ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. స్టేషన్​ వైపు వచ్చే బస్సులను కిలో మీటర్​ ముందే వెనక్కు మళ్లించారు. దీంతో పరిసరాల్లో ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. కాల్పుల్లో గాయపడ్డ వాళ్లను గాంధీ హాస్పిటల్​కు తరలించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరామర్శకు వచ్చే రాజకీయ పార్టీ నేతల్ని పోలీసులు అనుమతించలేదు. బీఎస్సీనేత ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ మాత్రం బాధితులను పరామర్శించారు. కాగా, ఆందోళనలు తగ్గిన తర్వాత రాత్రి 8.30 గంటలకు అధికారులు రైళ్లను పునరుద్ధరించారు.
రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ 
రైల్వే అదనపు డీజీ సందీప్ శాండిల్య మధ్యాహ్నం ఒంటి గంటకు మళ్లీ నిరసనకారుల వద్దకు చేరుకుని పరిస్థితి పర్యవేక్షించారు. ఆ సమయంలోనే పలువురు ఏడీజీ వద్దకు చేరుకుని తమ సమస్యలను తెలిపారు. పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. 
అదుపులో నిరసనకారులు
శుక్రవారం మబ్బుల ఐదున్నరకే నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రావడం మొదలైంది. గురువారం రాత్రి కల్లా సుమారు వంద మందికి పైగా చేరుకుని పలు చోట్ల బస చేశారు. ఒక్కొక్కరుగా రెండు మూడు వేల మంది బ్యాగులు భుజాలకు వేసుకుని ప్రయాణికుల్లా అంతా ప్లాట్ ఫాం పైకి చేరుకున్నారు. తొమ్మిది గంటలకు దాడులకు దిగారు. కాల్పుల తర్వాత వారిలో వందలాది మంది బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మరో 500 మంది దాకా స్టేషన్​లోనే పట్టాలపైనే బైఠాయించారు. రైల్వే ఏడీజీ సందీప్ శాండిల్య, ఎస్పీ అనురాధ.. నిరసనకారులతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినప్పటికీ శాంతించలేదు. వాయిదాపడ్డ ఆర్మీ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారనేది ప్రకటించిన తర్వాతే కదులుతామని స్పష్టం చేశారు. చివరికి వంద మందే అక్కడ ఉండిపోవడంతో అప్పటికే పోలీసులు వారందర్నీ రౌండప్  చేసి.. సాయంత్రం ఆరు గంటలకు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత.. రాత్రి ఏడున్నరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
దాడి వెనుక కుట్ర ఉంది: డీజీ సందీప్ ​శాండిల్య
సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​పై దాడి వెనుక కుట్ర దాగి ఉందని, దాన్ని త్వరలోనే ఛేదిస్తామని రైల్వే డీజీ సందీప్​ శాండిల్య ప్రకటించారు. ఈ దాడిలో ఎంత మంది పాల్గొన్నారనేది గుర్తిస్తున్నామని, ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కుట్రలో భాగంగానే నిరుద్యోగులు దాడి చేశారని, ఈ దాడికి కుట్ర చేసిన వ్యక్తులపై ఆరా తీస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులు విధ్వంసానికి పాల్పడిన సమయంలో వారిని ఆపేందుకు ప్రయత్నించిన కొంత మంది పోలీసులకు గాయాలైనట్టు రైల్వే ఎస్పీ అనురాధా వెల్లడించారు. 

రాకేశ్ కుటుంబానికి 25 లక్షల పరిహారం: సీఎం
సికింద్రాబాద్ ఘటనలో మరణించిన రాకేశ్​కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. రాకేశ్ మరణంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. కుటుంబానికి సానుభూతి తెలిపారు. తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందన్నా రు. కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేశ్ బలయ్యాడని ఆరోపించారు.

పక్కా ప్లాన్​ ప్రకారమే..!
నిరసనకారులు పక్కా ప్లాన్​తోనే ఆందోళనకు దిగినట్లు తెలుస్తున్నది. రెండు, మూడు రోజుల ముందు నుంచే వాట్సాప్ గ్రూపుల్లో దీనికి సంబంధించి చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,800 మంది అభ్యర్థులు వివిధ జిల్లాల్లో ఆర్మీ పరీక్షకు సిద్ధమవుతున్నారు. గతంలోనే ఫిజికల్, మెడికల్​ పరీక్షల్లో వీరంతా పాస్ అయ్యారు. అలాంటి అభ్యర్థుల కోసం కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించాల్సి ఉండగా.. అది రెండుసార్లు వాయిదా పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజెప్పాలనుకున్న అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ను ఎంపిక చేసుకున్నారు. పైగా అగ్నిపథ్​ స్కీంను కేంద్రం ప్రకటించడాన్ని వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి రెండు మూడు వందల మంది దాకా విడతలవారీగా సికింద్రాబాద్​ చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం రాత్రి కొందరు.. శుక్రవారం ఉదయం మరికొందరు స్టేషన్​ వద్దకు వచ్చారు. బ్యాగుల్లోనే  పెట్రోల్​, లైటర్లు తెచ్చుకున్నారు. ప్రయాణికుల్లా లోపలికి వెళ్లి.. దాడికి దిగారు.