హైదరాబాద్, వెలుగు: ప్రపంచ బ్యాంకుతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వివరాలను ప్రజల ముందు పెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా ప్రపంచ బ్యాంకుతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నట్టు వార్తలు వచ్చాయన్నారు. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు పోతున్న విషయం ప్రజలకు ముందే తెలిసినా, ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు పత్రికల్లో చూసే వరకు ఎవ్వరికీ తెలియదని చెప్పారు.
ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందాలు, వాటి పర్యవసానాలు ప్రజల ముందు ఉన్నాయన్నారు. ప్రపంచబ్యాంకు అప్పుల స్వభావం, అది పెట్టే షరతులు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు. కాబట్టి ఒప్పందాల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
