- బీజేఎల్పీ నేతకు కాంగ్రెస్ నిర్మల్ఇన్చార్జి శ్రీహరిరావు సవాల్
నిర్మల్, వెలుగు: దమ్ముంటే బీజేపీ సర్పంచ్ల జాబితా ప్రకటించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్నిర్మల్నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు సవాల్‌విసిరారు. మొదటి విడతలో కాంగ్రెస్బలపరచగా గెలిచిన సర్పంచ్‌లను మంగళవారం జిల్లా కేంద్రంలో సన్మానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహేశ్వర్‌రెడ్డి తప్పుడు లెక్కలను ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నిర్మల్ నియోజకవర్గంలో 128 స్థానాలకు గానూ కాంగ్రెస్ బలపరిచిన 60 మంది, స్వతంత్రులు19 మంది గెలిచారన్నారు.
మిగతా 49 మందిలో బీఆర్ఎస్, బీజేపీ సర్పంచ్‌లు ఎంతమందో ఆ పార్టీల నేతలు ప్రకటించాలని డిమాండ్‌చేశారు. అబద్ధపు మాటలకు అలవాటు పడ్డ బీజేఎల్పీ నేత 80 స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో స్పష్టమైన ఆధిక్యం వచ్చిందన్నారు.
రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వర్ రెడ్డి సండే ఎమ్మెల్యే నుంచి మంత్లీ ఎమ్మెల్యేగా ప్రమోషన్ పొందారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు అందుబాటులో సేవలందించాలని హితవు పలికారు. నిర్మల్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమ్ రెడ్డి, అబ్దుల్ హాది, సర్పంచ్‌లు అక్షర, భూమన్న, ఇంద్రకరణ్ రెడ్డి, సాయన్న, రమేశ్, రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
