- కన్నీరుమున్నీరైన దంపతులు
- డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యుల ఆందోళన
- మంచిర్యాలలోని ఓ ప్రైవేట్హాస్పిటల్లో ఘటన
మంచిర్యాల, వెలుగు: ఆమె పెళ్లయిన 15 ఏండ్లకు గర్భం దాల్చింది. ప్రతినెలా పరీక్షలు చేయించుకుంటూ పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూసింది.. చివరికి డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్తే కడుపులోనే శిశువు మృతిచెందిందని తెలిసి దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. డాక్టర్లు డెలివరీ ఆలస్యంగా చేయడమే ఇందుకు కారణమని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ తీరందాస్ బస్తీకి చెందిన కుమ్మరి పద్మ, వసంత్ దంపతులు. పెండ్లయిన 15 ఏండ్లకు పద్మ గర్భం దాల్చింది. అప్పటినుంచి మంచిర్యాలలోని తెలంగాణ తల్లి చౌరస్తా సమీపంలో గల శ్రీలత నర్సింగ్ హోమ్ లో చెకప్ చేయించుకుంటోంది. సోమవారం పురిటినొప్పులు రావడంతో మధ్యాహం 1 గంటకు కుటుంబసభ్యులు హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. మధ్యాహ్నం 3.45 గంటలకు డాక్టర్ చెక్ చేసి ఆపరేషన్ చేస్తానని చెప్పి రాత్రి వరకు పట్టించుకోలేదు. 9 గంటలకు డాక్టర్ శ్రీలత వచ్చి పద్మను అపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు.
కాసేపటికి శిశువు పల్స్ రేటు తక్కువగా ఉందని, తాను ఆపరేషన్ చేయలేనని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని చెప్పారు. ఇప్పటివరకు తల్లీబిడ్డ బాగానే ఉన్నారని చెప్పి ఇప్పుడు హైరిస్క్ అనడం ఏంటని బాధితురాలి కుటుంబసభ్యులు నిలదీశారు. దీంతో ఆపరేషన్ చేసి మృత శిశువును అప్పగించారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయిందని బాధితులు మంగళవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై కేసు నమోదు చేసి, హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్య ఏమాజీ డిమాండ్ చేశారు.
మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, టౌన్ సీఐ ప్రమోద్ రావు సిబ్బందితో అక్కడికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతశిశువుకు జీజీహెచ్ లో పోస్ట్ మార్టం నిర్వహించారు. కాగా.. ఈ ఆస్పత్రిలో ప్రతీరోజు 100 నుంచి 120 వరకు ఓపీ చూస్తూ ఆపరేషన్లను నిర్లక్షం చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
టీజీఎంసీ విచారణ..
గర్భస్థ శిశువు మృతి చెందిన ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) మెంబర్ డాక్టర్ యెగ్గన శ్రీనివాస్ తెలిపారు. పద్మకు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలున్నట్లు తెలిసిందన్నారు. ఈ నెల 2న డెలివరీకి రావాల్సి ఉండగా ఆలస్యమైందని తెలిపారు.
సోమవారం సాయంత్రం 4 గంటలకు స్టాఫ్ నర్స్ పరీక్షించి శిశువు హార్ట్ బీట్, తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పగా.. రాత్రి 9 గంటలకు డాక్టర్ పరీక్షించారని, అప్పటికే గర్భంలో శిశువు మరణించినట్టు గుర్తించారని పేర్కొన్నారు. శిశువు మరణానికి గల కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి తదుపరి విచారణ చేపడుతామని చెప్పారు.
