రేపటి సూర్యుడు ఉదయిస్తాడు.. రైతు తప్పక గెలుస్తాడు

రేపటి సూర్యుడు ఉదయిస్తాడు.. రైతు తప్పక గెలుస్తాడు
  • వ్యవసాయం దండగ కాదు.. పండగ అని సమాజానికి సందేశం ఇవ్వాలి: గద్దర్
  • గోసి, గొంగడి, గజ్జెలు కట్టుకొని వ్యవసాయం కోసం ప్రచారం చేస్తా: గద్దర్
  • ఆర్ నారాయణమూర్తి ‘‘రైతన్న’’ సినిమా ప్రీ రిలీజ్ మీట్

హైదరాబాద్: రేపటి సూర్యుడు తప్పక ఉదయిస్తాడు.. అలాగే ఇప్పుడు కష్టాలుపడుతున్న రైతు రేపు తప్పక గెలుస్తాడు అని ప్రజాగాయకుడు గద్దర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ అని మీడియా సమాజానికి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తన వంతుగా వ్యవసాయం కోసం గోసి, గొంగడి, గజ్జెలు కట్టుకొని ప్రచారం చేస్తానని గద్దర్ వెల్లడించారు. ఆదివారం ఎల్వీ ప్రసాద్ ల్యాబ్ లో  ఆర్ నారాయణమూర్తి దర్శకత్వం వహించి నటించిన ‘‘రైతన్న’’ సినిమా ప్రీ రిలీజ్ మీట్ జరిగింది. 
"రైతన్న" సినిమా ప్రీ రిలీజ్ మీట్ కు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ప్రజా గాయకుడు గద్దర్, వామపక్ష నేత  చాడ వెంకట రెడ్డి, కాంగ్రెస్ నేత కొందండ రెడ్డి, న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్, రైతు సంఘము నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ  సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ ‘‘రైతన్న’’ సినిమా కార్పొరేట్ సిష్టాన్ని..  ప్రభుత్వాన్ని.. పాలకులను ప్రశ్నించే లాగా ఉందన్నారు. నారాయణ మూర్తికి సోకులు నచ్చవని, ఇళ్లు లేదు..  భార్య లేదు.. తాను నమ్మిన సిద్ధాతం కోసమే బతుకుతున్నాడని ఆయన తెలిపారు. నారాయణమూర్తి సమాజ హితం తప్ప ఏమి కోరుకోడని ఆయన పేర్కొన్నారు. 
కనబడని శత్రువుతో యుద్ధం చేసే వాడు చాలా గొప్పోడు 
కనపడని శత్రువుతో యుద్ధం చేసేవాడు చాలా గొప్పవాడని ఈ సందర్భంగా ప్రజాగాయకుడు గద్దర్ పేర్కొన్నారు. నిశ్శబ్దం కూడా ఒక విప్లవమే.. దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలు ఎందుకురో రన్నా.... వ్యవసాయం అంటే దండగ కాదు.... పండగ... అంటూ రాగయుక్తంగా వివరించారు. అట్టి గడ్డి పండించుకొని కూడా ఈ దేశంలో బతకచ్చు... కానీ రైతులకు సంతోషం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం పండగ అని మీడియా వాళ్ళు కూడా సమాజానికి మెసేజ్ ఇవ్వాలని గద్దర్ కోరారు. దేశమే నా ప్రాణం అంటావు, దేవుడే నా సర్వం అంటావు... మరి ఢిల్లీలో నీ పక్కన 7 నెలల నుండి పోరాడుతున్న రైతుల మీద ఎందుకు దయ చూపలేకపోతున్నావని పాలకులను నిలదీశారు. ‘‘మీడియా అధినేతలకు అప్పీలు చేస్తున్న... వ్యవసాయం కోసం ప్రచారం చేయండి... రేపటి సూర్యడు ఉదయిస్తాడు.. రైతు తప్పక గెలుస్తాడు..’’ అని గద్దర్ ధీమా వ్యక్తం చేశారు.