- దేశానికే ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ: మంత్రి తుమ్మల
- గోద్రెజ్ కంపెనీ ఎండీ రాకేశ్ స్వామితో భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ రంగమే గ్రోత్ ఇంజిన్‌గా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశానికే ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మంగళవారం ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమిట్ రెండో రోజున మంత్రి తుమ్మలతో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ రాకేశ్ స్వామి , ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.." ప్రస్తుతం రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు జరుగుతున్నది.
దీన్ని రాబోయే రోజుల్లో 10 లక్షల ఎకరాలకు విస్తరిస్తాం. గత రెండేండ్లలో రైతు సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. పామాయిల్ సాగు ద్వారా ఆదాయం, గ్రీన్ కవర్ పెరుగుదల, పర్యావరణ హితం సాధ్యమవుతాయి. వ్యవసాయం అనుబంధ ఆర్థిక వ్యవస్థ విలువ 2047 నాటికి 400 బిలియన్ డాలర్లకు చేర్చుతాం" అని మంత్రి తుమ్మల వివరించారు.
ఆయిల్ పామ్ కాంప్లెక్స్ పురోగతిపై ఆరా
ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం గుబ్బగుర్తి వద్ద గోద్రెజ్ ఆగ్రోవెట్ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్ పురోగతిని మంత్రి తుమ్మల సమీక్షించారు. 116 ఎకరాల్లో నిర్మిస్తున్న ప్రాసెసింగ్ మిల్లు, 35 ఎకరాల్లో ఇప్పటికే పూర్తిగా పనిచేస్తున్న నర్సరీ (3 లక్షల మొక్కల సామర్థ్యం), ఆర్ అండ్ డి సెంటర్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, సమాధాన్ సెంటర్ పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాగా.. సీడ్ గార్డెన్ కోసం అదనంగా 40 ఎకరాల భూమి అవసరమని, స్థానిక సమస్యలతో కొంత ఆలస్యమైందని కంపెనీ అధికారులు మంత్రికి వివరించారు.
మలేషియా ఎస్‌డీ గుత్రీతో జరుగుతున్న సాంకేతిక ఒప్పందం, థాయిలాండ్ యూనివానిచ్ సహకారంతో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ రూపొందిస్తున్న విషయాన్ని కంపెనీ సీఈఓ సౌగత్ నియోగి, ఆయిల్ పామ్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ చావా వెంకటేశ్వరరావు, కార్పొరేట్ అఫైర్స్ హెడ్ మీషికా నాయర్ మంత్రికి తెలిపారు.ఈ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా కంపెనీ ప్రతినిధులను మంత్రి తుమ్మల ఆదేశించారు.

