సాగును లాభసాటిగా మార్చాలి.. అగ్రికల్చర్ వర్సిటీ 55వ కాన్వొకేషన్లోగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

సాగును లాభసాటిగా మార్చాలి.. అగ్రికల్చర్ వర్సిటీ 55వ కాన్వొకేషన్లోగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  • వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు చూపాలి
  • 844 మంది డిగ్రీ, పీజీ, పీహెచ్​డీ విద్యార్థులకు పట్టాల ప్రదానం

హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్​ యూనివర్సిటీ నుంచి బయటకు వస్తున్న యువ గ్రాడ్యుయేట్లు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నించాలని, రైతులు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, మార్కెటింగ్ సవాళ్లకు పరిష్కారాలు చూపాలని గవర్నర్​ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. 

రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లోని ప్రొఫెసర్  జయశంకర్  అగ్రికల్చర్​ యూనివర్సిటీ ఆడిటోరియంలో 55వ కాన్వొకేషన్​ శనివారం జరిగింది. కార్యక్రమానికి గవర్నర్  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ఈ వర్సిటీని జాతికి అంకితం చేశారని గుర్తుచేశారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నదన్నారు. ఇటీవల సెంటర్  ఫర్  డిజిటల్  అగ్రికల్చర్  ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఎస్​బీఐ ఫౌండేషన్  సహకారంతో ఏఆర్ఐఎస్ఏ ల్యాబ్  స్థాపన, ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’, ‘ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనాలు’ వంటి కార్యక్రమాలు రైతులకు మేలు చేశాయని గవర్నర్  పేర్కొన్నారు. వర్సిటీ వీసీ అల్దాస్  జానయ్య మాట్లాడుతూ వర్సిటీ విడుదల చేసిన పంటల వంగడాలు జాతీయ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయన్నారు. 

ఐకార్​ డైరెక్టర్  జనరల్  డాక్టర్  మంగీలాల్ జాట్ మాట్లాడుతూ వర్సిటీ నుంచి ఉత్తీర్ణులైన ఎందరో స్టూడెంట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేవలందిస్తున్నారని తెలిపారు.  కాగా.. 2021–-22లో ఉత్తీర్ణులైన 844 మంది డిగ్రీ, పీజీ, పీహెచ్​డీ విద్యార్థులకు గవర్నర్  జిష్ణుదేవ్  వర్మ పట్టాలు ప్రదానం చేశారు. 

20 మంది విద్యార్థులకు 30 బంగారు పతకాలు అందజేశారు. కంది అగ్రికల్చర్  ఇంజినీరింగ్  కాలేజీకి చెందిన జి.భార్గవి బీటెక్ ​ (అగ్రికల్చరల్  ఇంజినీరింగ్) లో 6 బంగారు పతకాలు, వరంగల్  అగ్రికల్చర్​ కాలేజీకి చెందిన అర్షియా తబస్సుం బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌లో 4 బంగారు పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్  డాక్టర్  జీఈసీహెచ్​ విద్యాసాగర్, పాలక మండలి సభ్యులు, అధికారులు, మాజీ వీసీలు, ఐకార్​ ప్రతినిధులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.