సాధారణంగా బ్యాంకింగ్ ఉద్యోగం అంటే ఉదయాన్నే వెళ్లి ఫైళ్లతో కుస్తీ పడుతూ రాత్రి వరకు ఆఫీసులోనే గడపడం గుర్తొస్తుంది. ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సర్వసాధారణం అయినప్పటికీ.. సాంప్రదాయ బ్యాంకింగ్ రంగం మాత్రం ఎప్పుడూ ఆఫీస్ ప్రెజెన్స్‌కే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అయితే ఈ పాత చింతకాయ పచ్చడి లాంటి పద్ధతులకు స్వస్తి పలుకుతూ దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇండస్‌ఇండ్ ముందడుగు వేసింది. తమ ఉద్యోగుల కోసం వారానికి రెండు రోజులు ఇంటి నుంచే పనిచేసుకునేలా హైబ్రిడ్ వర్క్ పాలసీని ప్రకటించింది.
దేశంలో ఇంధన సంక్షోభం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు కార్పొరేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పరిశీలించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ప్రధానిఈ అప్పీల్ చేయడానికి ముందే ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కొన్ని నెలల క్రితమే ప్రయోగాత్మకంగా పరిశీలించి.. ఉద్యోగుల నుండి అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ రావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా హైబ్రిడ్ వర్క్ విధానాన్ని విస్తరిస్తోంది.
ఎవరికి వర్తిస్తుంది? ఎందుకు ఈ మార్పు?
బ్యాంకింగ్ రంగంలో ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడానికి తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఐటీ, స్టార్టప్‌లు ఇస్తున్న ఫ్లెక్సిబిలిటీని అందుకోవాలనే లక్ష్యంతోనే ఇండస్‌ఇండ్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. బ్రాంచ్ ఆపరేషన్స్, నేరుగా కస్టమర్లను కలిసే రోల్స్, ఖచ్చితంగా ఆఫీసుకు రావాల్సిన విభాగాలకు ఇది వర్తించదు. కేవలం కార్పొరేట్, టెక్నాలజీ విభాగాల్లోని సెలెక్టెడ్ టీమ్స్‌కు మాత్రమే ఈ ఛాన్స్ అందించింది బ్యాంక్. వారు వారానికి 2 రోజులు ఇంట్లో, మిగిలిన రోజులు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
ALSO READ : ప్రధానిమోదీ విమానానికి..
ఇంటి నుండి పని చేయడం వల్ల ఉద్యోగుల్లో ప్రయాణ అలసట, ఒత్తిడి తగ్గి ప్రొడక్టివిటీ పెరుగుతుందని బ్యాంక్ గట్టిగా నమ్ముతోంది. మెజారిటీ కంపెనీలు ఉద్యోగులను మళ్లీ ఆఫీసులకు రమ్మని ఒత్తిడి తెస్తున్న వేళ ఇండస్‌ఇండ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలవనుంది. సాంప్రదాయ బ్యాంకింగ్ మైండ్‌సెట్‌ను బద్దలు కొడుతూ.. ఉద్యోగులకు పెద్దపీట వేసిన ఇండస్‌ఇండ్ బాటలోనే రేపు మరికొన్ని బ్యాంకులు నడిచిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
