గుజరాత్ వాసులకు దీపావళి బొనాంజా

గుజరాత్ వాసులకు దీపావళి బొనాంజా

త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ప్రజలకు ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. ఏడాదికి ప్రతి ఇంటికి 2 ఉచిత LPG సిలిండర్లను అందిస్తామని గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వాఘాని తెలిపారు. దాదాపు 38 లక్షల మంది గృహిణులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గుజరాత్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో లబ్ధిదారులకు రూ. 1000 కోట్ల వరకు ఆదా అవుతుందని చెప్పారు. దీంతో గుజరాత్ లో ప్రతి ఇంటికి రూ.1700 వరకు ఆదా అవుతుందన్నారు.

ఉచిత సిలిండర్ల  పథకానికి గుజరాత్ ప్రభుత్వం రూ.650 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సిఎన్‌జి), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జి)పై 10 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. సీఎన్‌జీలో 10 శాతం తగ్గింపును పరిగణనలోకి తీసుకుంటే కిలోకు 6 నుంచి 7 రూపాయల వరకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా పీఎన్‌జీపై కిలోకు రూ.55.50 వరకు ప్రయోజనం ఉంటుందని  జితు వాఘాని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన చాలా పెద్దదని, దీనిని  దీపావళి కానుకగా కూడా భావిస్తోందన్నారు. ఇది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.