- జప్తు చేసిన అహ్మదాబాద్కస్టమ్స్ అధికారులు
అహ్మదాబాద్: విమానం టాయిలెట్ స్పీకర్ ద్వారా సాగుతున్న బంగారం స్మగ్లింగ్‌ను అహ్మదాబాద్ కస్టమ్స్ అధికారులు గుర్తించారు. తనిఖీలు నిర్వహించి రూ. 4.26 కోట్ల విలువైన విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరిన ఇండిగో విమానంలో శుక్రవారం ఈ ఘటన వెలుగుచూసింది. విమాన ప్రయాణంలో స్మగ్లింగ్ జరుగుతున్నట్లు కస్టమ్స్ అధికారులకు ముందస్తు సమాచారం అందింది.
దీంతో అధికారులు విమాన ఇంజనీర్ల సాయంతో లోపల క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు. ముందు భాగంలో ఉన్న టాయిలెట్ గోడకు అమర్చిన అనౌన్స్మెంట్ స్పీకర్ బాక్స్‌ను విప్పి చూడగా నల్లటి ప్లాస్టిక్ టేప్‌తో చుట్టిన రెండు పౌచ్‌లు లభ్యమయ్యాయి. వాటిలో 24 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ దేశీయ మార్కెట్లో రూ. 4,26,89,325 ఉంటుందని అధికారులు ప్రకటించారు.
విమానం దిగిన తర్వాత స్మగ్లర్విమానాశ్రయ గ్రౌండ్ స్టాఫ్ ద్వారా బంగారాన్ని బయటకు తరలించేందుకు ప్లాన్ చేసినట్లు కస్టమ్స్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ తనిఖీలు తీవ్రతరం కావడంతో దొరికిపోతామనే భయంతో అతడు బంగారాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. స్మగ్లింగ్ ముఠా వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
