- ఏఐ ద్వారా ఫ్యూచర్ ఫొటోను క్రియేట్ చేసిన ‘వీవార్డ్’ యాప్
పారిస్: రోజూ గంటల తరబడి స్మార్ట్ ఫోన్లు చూస్తూ ఉంటే మానసిక, శారీరక ఆరోగ్యంపై చాలా ఎఫెక్ట్ పడుతుందని ఇదివరకే అనేక పరిశోధనల్లో తేలింది. అయితే, ఫోన్‌కు అడిక్ట్ అయిపోయిన వాళ్లు.. మరో 25 ఏండ్లలో భయంకరంగా మారిపోతారంటోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). మనుషుల ఆకారాలే మారిపోతాయని, కార్టూన్ క్యారికేచర్ లలో గీసే వింత జీవుల మాదిరిగా తయారవుతారని అంటోంది.
ఇప్పటికే స్మార్ట్ ఫోన్‌కు అడిక్ట్ అయిపోయినవాళ్లు మరో పాతికేళ్ల వరకూ ఈ అడిక్షన్‌ను ఇలాగే కొనసాగిస్తే గనక.. అప్పుడు వారి రూపం ఎలా ఉంటుందో ఊహించాలంటూ ఫ్రాన్స్‌కు చెందిన స్టెప్ ట్రాకింగ్ యాప్ ‘వీవార్డ్’ నిర్వాహకులు ఈమేరకు ఏఐని అడిగారు. ముందుగా శామ్ అనే అందమైన యువకుడి 3డీ మోడల్‌ను ఏఐ ద్వారా క్రియేట్ చేశారు. ఆ ఫొటోలోని వ్యక్తి ఇప్పుడు ఫోన్‌కు అడిక్ట్ అయితే 2050లో ఎలా ఉంటాడో చెప్పాలని ప్రాంప్ట్ ఇచ్చారు. ఏఐ క్రియేట్ చేసిచ్చిన ఫొటోను చూసి షాక్ అయ్యారు. ఆ ఫొటోను జోడిస్తూ తాజాగా అవేర్నెస్ వీడియోను రిలీజ్ చేశారు.
ఏఐ ఏం చెప్పిందంటే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), సీడీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు చేసిన పరిశోధనల ఫలితాలను విశ్లేషించిన ఏఐ ఈ ఫొటోను క్రియేట్ చేసింది. ఫోన్ కు అడిక్ట్ అయినవాళ్లు రోజూ గంటల తరబడి కదలకుండా కూర్చోవడమో, పడుకోవడమో చేస్తుంటారు. ఇలాంటి స్తబ్దతతో కూడిన జీవనశైలి దీర్ఘకాలం కొనసాగితే మనుషుల్లో రకరకాల మార్పులు వస్తాయని ఏఐ ఊహించింది.
బట్టతల, గూని, బాన పొట్ట వస్తాయని.. మెడనొప్పి వస్తుందని, కండ్లు ఎర్రబారి, కండ్ల కింద నల్లటి చారలొస్తాయని ఫొటోలో చూపింది. అలాగే కాళ్లల్లో సిరలు ఉబ్బి వేరికోస్ వీన్స్ సమస్య తలెత్తుతుందని, కీళ్లు గట్టిబారిపోయి కదలికలు తగ్గిపోతాయని ఫొటో ద్వారా ఏఐ చెప్పింది. చర్మం పొడిబారిపోయి, కాంతివిహీనం అవుతుందని.. డెర్మటైటిస్ బారిన కూడా పడొచ్చని వెల్లడించింది.
మొత్తంగా ఫోన్ అడిక్షన్ వల్ల వృద్ధాప్యం త్వరగా వచ్చేస్తుందని.. మధ్య వయసులోనే ముసలివాళ్లయిపోవడం ఖాయమని ఏఐ హెచ్చరించింది. కాగా, వేరికోస్ వీన్స్ సమస్యతో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి ప్రాణాంతకం కావచ్చని, అలాగే సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడపడం వల్ల ఒంటరితనంలోకి జారుకోవడంతోపాటు విపరీతమైన స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్‌కు గురవుతారని హెల్త్ ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు. అందుకే ఫోన్ వాడకం తగ్గించుకుని, శారీరక శ్రమ ఉండేలా లైఫ్ స్టైల్‌ను మార్చుకోకపోతే ఏఐ ఊహించినట్టు భయంకరంగా మారిపోవడం తప్పదని హెచ్చరిస్తున్నారు.
