కరోనా ప్యాండమిక్ తర్వాత సైంటిస్ట్‌లు అలర్ట్ అయ్యారు. మళ్లీ అలాంటి ప్యాండమిక్‌లు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. వార్తలు, హాస్పిటల్ రికార్డులు, సోషల్ మీడియా పోస్టులు, వాతావరణ సమాచారం, జంతువుల హెల్త్ డేటా లాంటి అన్ని రకాల సమాచారాన్ని ఏఐ చాలా వేగంగా విశ్లేషిస్తుంది.
ఏదైనా కొత్త వ్యాధి లేదా వైరస్ లక్షణాలను గుర్తిస్తే వెంటనే సైంటిస్ట్‌లను అలర్ట్ చేస్తుంది. ప్రస్తుతం హెల్త్ మ్యాప్, బ్లూడాట్, ప్రోమెడ్, ఎపివాచ్ లాంటి ఏఐ బేస్డ్ వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా వ్యాధులపై నిత్యం నిఘా పెడుతున్నాయి. ముఖ్యంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌లను ముందుగానే గుర్తించేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి.
అప్పటికి ఏఐ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందకపోయినా.. కెనడాకు చెందిన బ్లూడాట్ అనే ఏఐ 2019 చివర్లో చైనాలో అసాధారణ న్యుమోనియా కేసులు నమోదవుతున్నాయని గుర్తించి హెచ్చరించింది. ఆ తర్వాతే చైనాలో కరోనా వచ్చింది. ప్రస్తుతం ఆఫ్రికాలో కనిపిస్తున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని గుర్తించడంలోనూ ఏఐ బేస్డ్ వ్యవస్థలు సాయపడ్డాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భవిష్యత్తులో వచ్చే ప్రతి ప్యాండమిక్‌ను ఏఐ పూర్తిగా అంచనా వేయలేకపోయినా, ప్రమాద సంకేతాలను మాత్రం ఇవ్వగలదు. మన దేశంలో కూడా ఏఐ బేస్డ్ మానిటరింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులను ముందుగానే గుర్తించి, నియంత్రించడానికి ఇవి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
