ఒబామాను అరెస్టు చేసినట్లు ఏఐ వీడియో .. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పోస్టు పెట్టిన ట్రంప్

ఒబామాను అరెస్టు చేసినట్లు ఏఐ వీడియో .. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పోస్టు పెట్టిన ట్రంప్

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్  ఒబామాను ప్రెసిడెంట్  డొనాల్డ్  ట్రంప్  ఆర్టిఫిషియెల్  ఇంటెలిజెన్స్  సాయంతో అరెస్టు చేయించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్రూత్  సోషల్ లో పోస్టు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదంటూ పేర్కొన్నారు. ఏఐ సాయంతో జనరేట్  చేసిన వీడియో అది. చట్టానికి అమెరికా అధ్యక్షుడు అతీతుడు అంటూ ఒబామా ఆ వీడియోలో వ్యాఖ్యానిస్తారు. కాసేపటికే ఎఫ్ బీఐ ఏజెంట్లు వైట్ హౌస్ లో ప్రవేశించి ఒబామాకు సంకెళ్లు వేసి తీసుకెళ్తారు. ఆ టైంలో ట్రంప్  అక్కడే నవ్వుతూ ఉంటారు. తర్వాత ఓ జైల్లో నారింజ రంగు దుస్తుల్లో ఒబామా కనిపిస్తారు. అలాగే, పలు లీడర్లు కూడా ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదు’ అని వ్యాఖ్యానించేలా ఆ వీడియోను రూపొందించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. 

ఈ వీడియోపై పలువురు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ట్రంప్ ది బాధ్యతారాహిత్యం అని మండిపడ్డారు. కాగా.. 2016 ఎన్నికల సమయంలో ఒబామా పాలకవర్గం మోసాలకు పాల్పడిందని ట్రంప్  గత వారం ఆరోపించారు. యూఎస్  నేషనల్  ఇంటెలిజెన్స్  డైరెక్టర్  తులసీ గబార్డ్  కూడా ట్రంప్  ఆరోపణలను సమర్థించారు. 2016 ఎన్నికల టైంలో మోసాలు జరిగాయని, దీనికి సంబంధించి తన వద్ద తిరుగులేని  ఆధారాలు ఉన్నాయని గబార్డ్  పేర్కొన్నారు. గత ఒబామా పాలకవర్గంపై విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘2016లో ఒబామా పాలకవర్గంలో అత్యంత శక్తివంతమైన అధికారులు ట్రంప్ కు వ్యతిరేకంగా కుట్రపన్ని ఇంటెలిజెన్స్ ను ఎలా రాజకీయం చేశారో, ట్రంప్  అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఎలా యత్నించారో అమెరికన్లు త్వరలోనే తెలుసుకుంటారు” అని ‘ఎక్స్’ లో గబార్డ్  వ్యాఖ్యానించారు.