
- సెక్యులర్ అంటే మోదీకి భయం
- సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర: ఖర్గే
- రాజ్యాంగం జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
- విదేశాంగ విధానంలో ప్రధాని ఫెయిల్
- మిత్ర దేశాలు శత్రు దేశాలుగా మారుతున్నయ్
- పాక్‌పై యుద్ధాన్ని మధ్యలోనే ఎందుకు ఆపారు?
- మోదీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ.. దేశ భద్రతపై లేదు
- హైదరాబాద్‌లో కాంగ్రెస్ 50 కేంద్ర సంస్థలు పెట్టింది
- మరి బీజేపీ ఏం ఇచ్చిందో చెప్పాలి?
- మన్‌కీ బాత్ కాదు.. కామ్‌కీ బాత్ కావాలి
- కులగణనలో దేశానికే తెలంగాణ రోల్‌మోడల్
- రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్‌తో కలిసి నడవాలని ప్రజలకు పిలుపు
- హైదరాబాద్‌లో సామాజిక న్యాయ సమరభేరి సభ
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీకి సెక్యులర్పదమంటే ఎందుకంత భయమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. రాజ్యాంగంలోని సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చూస్తున్నాయని మండిపడ్డారు. ‘‘బీజేపీ తమ పార్టీ రాజ్యాంగంలో సెక్యులరిజం, సోషలిజం పదాలను చేర్చుకున్నది. కానీ దేశ రాజ్యాంగం నుంచి వాటిని తొలగించాలని చూస్తున్నది. ఇది అటూఇటూ కాని వైఖరి’’ అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాటం చేస్తున్నామని.. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. ప్రజలంతా తమతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘సామాజిక న్యాయ సమరభేరి’ సభకు ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘42 దేశాలు తిరిగానని గొప్పలు చెప్పుకునే మోదీ.. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్‌కు ఎందుకు వెళ్లడం లేదు? మణిపూర్ వెళ్లే తీరిక లేదా? లేక మణిపూర్ భారత్‌లో అంతర్భాగం కాదా?’’ అని నిలదీశారు. యువత, రైతులు, పేదలు కలిసి పోరాడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టే.. ఢిల్లీలోనూ అధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశాన్ని కాపాడతామన్నారు.
ట్రంప్ కామెంట్లపై మౌనమెందుకు..?
పాకిస్తాన్‌తో యుద్ధాన్ని మధ్యలోనే ఎందుకు ఆపేశారని ప్రధాని మోదీని ఖర్గే ప్రశ్నించారు. ఆయనకు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ.. దేశ భద్రతపై లేదని మండిపడ్డారు. ‘‘పాకిస్తాన్‌ను అంతం చేస్తామని గొప్పలు చెప్పిన మోదీ, బీజేపీ నేతలు.. యుద్ధాన్ని మధ్యలో ఎందుకు ఆపారు. ఇందిరాగాంధీ పాకిస్తాన్‌ను రెండు ముక్కలుగా చేసి, బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం కల్పించారు. ఆనాడు అమెరికా ఆంక్షలు, ఒత్తిళ్లను ధిక్కరించారు. కానీ మోదీ ఏం చేశారు? పాకిస్తాన్‌తో యుద్ధం మధ్యలోనే ఆపేశారు? యుద్ధం తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతుంటే మోదీ నోరు ఎందుకు మూగబోయింది?’’ అని ప్రశ్నించారు.
ఇందిరా, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఎవరైనా అలా చేశారా..? అని నిలదీశారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్ర్య సమరంలో ఏనాడూ పాల్గొనలేదని, క్షమాపణ చెప్పాల్సింది వారేనన్నారు. ‘‘మోదీ విదేశాంగ విధానంలో ఫెయిల్అయ్యారు. ఒకప్పటి మిత్ర దేశాలన్నీ, ఇప్పుడు మనకు శత్రువులుగా మారుతున్నాయి. చైనా, పాకిస్తాన్ ఇప్పటికే శత్రు దేశాలుగా ఉంటే.. నేడు నేపాల్ లాంటి దేశాలు కూడా మనకు దూరమవుతున్నాయి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు మేం పోరాడుతున్నాం’’ అని ఖర్గే పేర్కొన్నారు.
మాటలే చేతల్లేవ్..
మోదీ మాటలు చెప్పుడు తప్ప, చేతల్లో చూపించడం లేదని ఖర్గే విమర్శించారు. ‘‘మోదీ మన్‌కీ బాత్ అంటూ ప్రసంగాలు చేస్తారు. కానీ కామ్‌కీ బాత్ లేదు. ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను బర్బాద్ చేశారు. చట్టాలను ఉల్లంఘించారు’’ అని మండిపడ్డారు. నెహ్రూ, ఇందిరా హయాంలో హైదరాబాద్‌లో 50 కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్థాపించారని, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. మరి తెలంగాణకు మోదీ ఏం తెచ్చారని ప్రశ్నించారు. ‘‘2 కోట్ల ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధర ఇస్తామని మోదీ అబద్ధాలు చెప్పారు.
ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. ఎవరేం చేస్తున్నారో గమనించాలి. కాంగ్రెస్ చెప్పినవన్నీ చేసి చూపిస్తున్నది. ప్రజలంతా కాంగ్రెస్‌తో కలిసి నడిస్తే దేశం బాగుపడుతుంది’’ అని అన్నారు. ‘‘కాంగ్రెస్ పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేస్తుంది. మీరు మాకు సహకరించి మద్దతు ఇవ్వండి. మమ్మల్ని విశ్వసించి కాంగ్రెస్‌పార్టీకి మద్దతు ఇస్తే.. మీకున్న అన్ని కష్టాలు తీరుతాయి” అని అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్‌తో కలిసి నడవకపోతే దేశానికి నష్టం జరుగుతుందన్నారు.
దేశానికి తెలంగాణ ఆదర్శం..
బీసీ కులగణనలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఖర్గే అన్నారు. ‘‘రాహుల్ గాంధీ చెప్పినట్టు తెలంగాణ ఒక మోడల్‌గా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో పోరాడుతాం. రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్, పేదలకు సన్న బియ్యం, రైతు భరోసా లాంటి పథకాలు అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇస్తే ప్రజలు అమ్ముకునేవారు. ఇప్పుడు మేము ప్రజలు తినే సన్న బియ్యం ఇస్తున్నాము. 4.5 లక్షల మంది గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం తీసుకొస్తున్నాం. రోహిత్ వేముల పేరుతో యువతకు మద్దతిచ్చే చట్టం తీసుకొస్తాం” అని చెప్పారు. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవినీతి పూర్తిగా తగ్గిపోయిందన్నారు.
సభ సక్సెస్.. కాంగ్రెస్‌లో జోష్
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన “సామాజిక న్యాయ సమర భేరి” సభ సక్సెస్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. సభకు అంచనాలకు మించి కార్యకర్తలు, జనం రావడంతో పీసీసీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు ముందు ఈ సభ సక్సెస్ కావడంతో పార్టీ నాయకత్వం గెలుపుపై ధీమాతో ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించనుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
సామాజిక న్యాయం నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో ఈ సభ ద్వారా కాంగ్రెస్ సక్సెస్ అయిందనే భావన పార్టీ సీనియర్ నేతల్లో వ్యక్తం అయింది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయిలో మంత్రులు, ఇన్చార్జ్ మంత్రులు, రాష్ట్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కొన్ని రోజులుగా చాలా ప్లాన్‌తో, సమన్వయంతో పని చేయడంతోనే ఎల్బీ స్టేడియం సభ కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిపోయిందని నేతలు అంటున్నారు. ఈ సభ సక్సెస్‌తో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. రాష్ట్ర నాయకత్వం పనితీరుపై పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు.
మోదీ.. దేశభక్తి ఇదేనా..?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఆల్ పార్టీ మీటింగ్‌లో చెప్పాం. కానీ కీలకమైన ఆ మీటింగ్‌కు ప్రధాని మోదీ హాజరు కాలేదు. మేం దేశం కోసం ఆలోచిస్తుంటే.. మోదీ ఎన్నికల కోసం చూస్తున్నారు. ఆయనకు బిహార్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ.. దేశ భద్రతపై లేదు. -