మిగులు రాష్ట్రాన్నిఅప్పుల్లో ముంచిండు:ఖర్గే

మిగులు రాష్ట్రాన్నిఅప్పుల్లో  ముంచిండు:ఖర్గే
  • తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు: ఖర్గే
  • దేశ సంపదను మోదీ కార్పొరేట్లకు దోచిపెడ్తున్నరు
  • వీరిద్దరికీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపు
  • తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆర్థిక సంక్షోభంలో ముంచారని ఆరోపించారు. ఆదివారం తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారని, కానీ ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. ఉద్యమంలో లేనివాళ్లు తెలంగాణను విముక్తం చేశామని ప్రచారాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసి చూపిస్తుందని, ఈ విషయం ఇప్పటికే నిరూపితమైందని అన్నారు. రైతు భరోసా పథకం కింద కౌలు రైతులు సహా రైతులందరికీ ఎకరానికి ఏటా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్​కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇవి అమలు చేస్తామని తేల్చి చెప్పారు. అప్పట్లో యూపీఏ హయాంలో ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత పథకం, పిల్లల కోసం విద్యాహక్కు చట్టం వంటివి తీసుకొచ్చామని చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రం హామీలిచ్చి చేతులు దులుపుకుంటారని, ఒక్క హామీనీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభాకు తగ్గట్టు బడ్జెట్ పెట్టాల్సి ఉన్నా.. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని విమర్శించారు. ‘‘దేశ సంపదను కార్పొరేట్ దోస్తులకు మోదీ దోచిపెడుతున్నారు. వాళ్లే ధనవంతులు అవుతున్నారు. కేసీఆర్ కూడా అదే రీతిలో చేస్తున్నారు” అని ఆరోపించారు.

మోదీ, కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మోసగాళ్లని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘‘2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ హామీ ఇచ్చారు. మీకు ఉద్యోగాలు వచ్చాయా? విదేశాల నుంచి నల్ల ధనం తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పారు. మీ ఖాతాలో ఆ డబ్బులు పడ్డాయా? ఓట్ల కోసం మోదీ, కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే. ఇద్దరూ మోసగాళ్లే. ఆ మోసగాళ్లకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం ఉంది. మోదీ, కేసీఆర్ బయటికి గొడవపడినట్టు నటిస్తున్నారు. 

Also Rard: జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్” అని ఆరోపించారు. కార్పొరేట్ల రుణాలను కేంద్రం మాఫీ చేస్తున్నదని, రూ.40 వేల కోట్లను ఎగ్గొట్టి కొందరు విదేశాలకు పారిపోయారని చెప్పారు. బడాబాబులు పన్నులు ఎగ్గొడ్తున్నారని, ప్రజలు మాత్రం పన్నుల్లో నలిగిపోతున్నారని అన్నారు.

సెప్టెంబర్ 17న రావడం సంతోషకరం

తెలంగాణ, కర్నాటక, మరాఠ్వాడాలకు సెప్టెంబర్ 17న విముక్తి కలిగిన రోజు అని, ఈ సందర్భంగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే.. హైదరాబాద్‌‌‌‌కు మాత్రం 1948 సెప్టెంబర్​ 17న స్వాతంత్ర్యం వచ్చిందని, 13 నెలల తర్వాతే స్వేచ్ఛ లభించిందని చెప్పారు. అది కూడా కాంగ్రెస్ వల్లే సాధ్యమైందన్నారు.

సోనియా కాలు మోపడంతో తెలంగాణ పునీతమైంది: రేవంత్

2009లో మలిదశ ఉద్యమంలో ఎందరో విద్యార్థులు, ఉద్యమకారులు తెలంగాణ కోసం కొట్లాడారని రేవంత్ రెడ్డి అన్నారు. వందలాది మంది బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే.. బిడ్డలు చనిపోతుంటే, కుటుంబంలో సభ్యులను కోల్పోతే ఆ దు:ఖం ఎట్లుంటదో తెలిసిన సోనియమ్మ రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. ‘‘మనం తెలంగాణ తల్లిని చూడలేదు. మన పెద్దలు తెలంగాణ తల్లి గురించి చెప్పారు. 60 ఏండ్ల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని 2004 కరీంనగర్ సభలో తెలంగాణ ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టకున్నారు. మాట తప్పని, మడమ తిప్పని తెలంగాణ తల్లి సోనియమ్మ. ఇప్పుడు లక్షలాది మంది మధ్య నిలబడ్డారు. ఆమెకు మనందరం నిటారుగా నిలబడి స్వాగతం పలుకుదాం. ఫామ్‌‌‌‌హౌస్​లో పండుకున్న సీఎం కేసీఆర్ గుండెలు అదరాలి’’ అని రేవంత్​ అన్నారు.  ‘‘తొమ్మిదేండ్లలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, మహిళలు, మైనారిటీలను కేసీఆర్ మోసం చేశారు. రాష్ట్రంలో అన్నమో రామచంద్ర అని అడుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి” అని ఆరోపించారు. ‘‘సోనియా గాంధీ కాలు మోపడంతో తెలంగాణ పునీతమైంది. మొదట పరేడ్ గ్రౌండ్​లో సభ పెట్టుకోవాలన్నా.. కేంద్రం, అమిత్ షా, కిషన్ రెడ్డి కుట్ర పన్ని గ్రౌండ్​ను ఇవ్వలేదు. గచ్చిబౌలి స్టేడియం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తుక్కుగూడలో పెట్టుకుంటామంటే.. దేవుడి భూములంటూ ఆ భూమినీ ఇవ్వలేదు. కానీ రైతులు, తెలంగాణ ప్రజలు అండగా నిలబడి ఈ స్థలం ఇచ్చారు’’ అని చెప్పారు. 

కాంగ్రెస్‌‌‌‌కు అధికార వ్యామోహం లేదు: సుఖ్వీందర్ సింగ్ సుఖు

కాంగ్రెస్ పార్టీకి అధికారంపై వ్యామోహం లేదని, ప్రజల కోసమే పనిచేస్తుందని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు అన్నారు. హిమాచల్​ప్రదేశ్​లో అన్ని హామీలను అమలు చేశామని చెప్పారు. తమ పార్టీ ఎప్పుడూ ఉత్త మాటలు చెప్పదని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. 
తెలంగాణ ఇవ్వొద్దని నాడు పార్టీ సీఎం చెప్పినా.. లెక్క చేయకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలే కాంగ్రెస్​కు ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం బలిదానాలు చేసిందని, ఎన్నో త్యాగాలను చేసిందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. అలాంటి కుటుంబం ఇప్పుడు తెలంగాణ ప్రజలందరి ముందుకు వచ్చిందని చెప్పారు.

గడీలు రంగులేసుకున్నయ్

తెలంగాణలో మళ్లీ గడీలు రంగులేసుకున్నాయని, నియంత పాలన నడుస్తున్నదని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో బెల్టు షాపులకు అడ్డాగా, అవినీతికి కేంద్రంగా తెలంగాణ మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. 
- పొన్నం ప్రభాకర్

కేసీఆర్ సెక్యులర్ కాదు 

కేంద్రం ప్రవేశపెట్టే ప్రతి చట్టానికీ కేసీఆర్ మద్దతు పలుకుతున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. ముస్లింలకు వ్యతిరేకంగా తెచ్చిన ట్రిపుల్ తలాక్​ సహా అనేక చట్టాలకు కేసీఆర్ మద్దతు ఉందన్నారు. దేశంలో ద్వేషాన్ని తుడిచిపెట్టేందుకు కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీకి ఎంఐఎం, బీఆర్ఎస్​లు బీటీమ్స్‌‌‌‌ అని ఆరోపించారు. దళితుడిని సీఎం  చేస్తానని కేసీఆర్​ మాట తప్పిండు.
- షబ్బీర్ అలీ

బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌లది పేగుబంధం 

తెలంగాణ సాయుధ పోరాటంలో లేని బీఆర్ఎస్, బీజేపీలు.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇక్కడికి వస్తే ఆమెకు అర్హతలేదని తప్పుడు కూతలు కూస్తున్నాయని సీతక్క మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్​లు పేగుబంధమై కలిసి పనిచేస్తున్నాయని, కాంగ్రెస్​ను లేకుండా చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. సోనియా గాంధీది త్యాగాల కుటుంబమని చెప్పారు.
 - సీతక్క

అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారు

అన్ని వర్గాలను సీఎం కేసీఆర్ మోసం చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. సభకు వచ్చినోళ్లు ఒక్కొక్కరు వంద ఓట్లు వేయించినా వంద సీట్లు గెలుస్తామని అన్నారు. టీఎస్​పీఎస్సీలో అవినీతి, కాళేశ్వరం కమీషన్లతో అక్రమాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిండు

రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయించిండు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల్లో ముంచిండు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. దేశ సంపదను కార్పొరేట్ దోస్తులకు మోదీ దోచిపెడుతుంటే.. కేసీఆర్ కూడా అదే రీతిలో చేస్తున్నడు. ఓట్ల కోసం మోదీ, కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే. ఇద్దరూ మోసగాళ్లే. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం ఉంది. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్. 
- మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ చీఫ్