సీఎం రేవంత్ అంటే మోదీకి భయం : జైరాం రమేశ్

సీఎం రేవంత్ అంటే  మోదీకి భయం : జైరాం రమేశ్
  • రేవంత్​కు సమన్లు.. తెలంగాణను అవమానించడమే : జైరాం రమేశ్

న్యూఢిల్లీ, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి అంటే ప్రధాని నరేంద్ర మోదీకి భయమని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జై రాం రమేశ్​అన్నారు. రేవంత్​కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేయడం నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికల ప్రక్రియకు తూట్లు పొడవడమే అని ఫైర్ అయ్యారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా జైరాం రమేశ్ మూడు ప్రశ్నలు సంధించారు. డీప్ ఫేక్ వీడియో వైరల్ పై బీజేపి నేతలకు చురకలంటించారు. బీజేపీని విమర్శిస్తూ పోస్టులు పెట్టిన కాంగ్రెస్ నేతలపైకి ప్రధాని పోలీసులను పంపిస్తున్నారని అన్నారు.

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌‌కు సంబంధించిన నకిలీ వీడియోలను బీజేపీ తయారుచేసి, షేర్​ చేసినప్పుడు  ఢిల్లీ పోలీసులు ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. ఇది పోలీసుల ద్వంద్వ నీతికి నిదర్శనమే కాకుండా.. తెలంగాణ ప్రజలను అవమానించడమే అని అన్నారు. లోక్​సభ ఎన్నికల రెండు ఫేజ్​లలో పేలవమైన ప్రదర్శనతో బీజేపీలో  నైరాశ్యం నెలకొన్నదని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో బీజేపీ అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీస్తారని ప్రధాని భయపడుతున్నారా? అని సెటైర్​ వేశారు.

తెలంగాణపై మోదీ ప్రతీకార రాజకీయం

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని పాలైన రాష్ట్రాలను విస్మరించడం మోదీకి అలవాటైందని జైరాం రమేశ్ అన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో ఆయన ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.