
- ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, మహిళా, ఓసీ నుంచి ఒక్కో పేరు ఉండాలి
- పార్టీకి విధేయుడై, జనం నాయకునిగా ముద్రపడ్డ నేతల పేర్లు సిఫారసు చేయాలి
- సీఎం, పీసీసీ చీఫ్, మంత్రుల ఒత్తిడికి తలొగ్గద్దు
- మీటింగ్లో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, వెలుగు: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను ఏఐసీసీ స్పీడప్ చేసింది. గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ సెంట్రల్ఆఫీసు ఇందిరా భవన్ లో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై నియమించిన అబ్జర్వర్లతో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణతో పాటు రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అబ్జర్వర్లు, ఆ రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, పార్టీ ఇన్చార్జ్ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించిన పార్టీ విధి విధానాలను ఏఐసీసీ నేతలు అబ్జర్వర్లకు వివరించారు. రాష్ట్రంలోని 35 జిల్లాలకు (33 రెవెన్యూ జిల్లాలతో పాటు పార్టీ పరంగా అదనంగా ఉన్న ఖైరతాబాద్, సికింద్రాబాద్ జిల్లాలు) డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం జాతీయ నాయకత్వం 22 మంది అబ్జర్వర్లను నియమించింది.
డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం సిఫారసు చేసేందుకు పార్టీ ప్రాధాన్యతలను అబ్జర్వర్లకు జాతీయ నేతలు వివరించారు. వచ్చే నెల 4 న ఏఐసీసీ అబ్జర్వర్లకు హైదరాబాద్ లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ఇందులో వారికి వివరించనున్నారు. 5వ తేదీ నుంచి పది రోజుల పాటు మొత్తం 35 జిల్లాల్లో పర్యటించి పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసి జిల్లాల్లో నాయకుల పనితీరు, పార్టీకి వారు చేస్తున్న సేవలు, ఇతర వివరాలను తెలుసుకోనున్నారు.
ఒక్కో జిల్లా నుంచి డీసీసీ చీఫ్ పదవి కోసం ఆరు పేర్లను హైకమాండ్ కు సిఫారసు చేయాలని ఈ సమావేశంలో నేతలు సూచించారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, జనరల్ కేటగిరీల నుంచి ఒక్కో పేరును సిఫారసు చేయాల్సి ఉంటుంది. పార్టీకి విధేయుడై ఉండడంతో పాటు జిల్లాల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో వారి పాత్ర, జనం సమస్యలపై ఆ నేత పోరాడే తీరును పరిగణనలోకి తీసుకొని డీసీసీ చీఫ్ కోసం సిఫారసు చేయాలని అబ్జర్వర్లకు వివరించారు.
అబ్జర్వర్లు పారదర్శకంగా వ్యవహరించాలి
డీసీసీ అధ్యక్షుల పేర్లను హైకమాండ్‌కు సిఫారసు చేసే విషయంలో అబ్జర్వర్లు పూర్తి పారదర్శకంగా, పార్టీ బలోపేతమే లక్ష్యంగా వ్యవహరించాల్సి ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ప్రలోభాలకు, ప్రభావాలకు లొంగవద్దని ఢిల్లీ పెద్దలు గట్టిగా స్పష్టం చేసినట్లు సమాచారం. చివరకు ఆ రాష్ట్ర సీఎం, పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇన్‌చార్జ్‌తో పాటు పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసులను సైతం పట్టించుకోవాల్సిన అవసరం లేదని అబ్జర్వర్లకు ఈ సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెల్సింది.
డీసీసీ అధ్యక్షుల ఎంపికలో పూర్తి స్వేచ్ఛను, నమ్మకాన్ని అబ్జర్వర్లకు హైకమాండ్ ఇచ్చిందనే విషయాన్ని వారు ఏమాత్రం విస్మరించరాదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒక రకంగా చెప్పాలంటే అబ్జర్వర్ల నిజాయితీ, నిబద్ధత అనే పునాదిపైనే డీసీసీ చీఫ్ నియామకం ఉంటుందని, చాలా జాగ్రత్తగా పేర్లను సిఫారసు చేయాల్సి ఉంటుందని ఈ మీటింగ్ లో అబ్జర్వర్లకు వివరించారు.
ఒక్కో జిల్లా నుంచి అధ్యక్ష పదవికి ఆరు పేర్లను అబ్జర్వర్లు సిఫారసు చేస్తే..అందులో ఒక పేరును హైకమాండ్ ఫైనల్ చేయనుంది. ఆ జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణల ఆధారంగా, పార్టీకి వారి విధేయత, సీనియారిటీ, జనంలో ఉన్న పేరును పరిగణనలోకి తీసుకొని డీసీసీ చీఫ్ఎంపిక ఉంటుందని జాతీయ నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం.