
హైదరాబాద్, వెలుగు: డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు ఏఐసీసీ పరిశీలకులు శనివారం రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో 35 జిల్లాలకు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను నియమించేందుకు ఇటీవలే వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 22 మంది పార్టీ సీనియర్ నేతలను పరిశీలకులుగా హైకమాండ్ నియమించింది. వీళ్లు శనివారం హైదరాబాద్ చేరుకొని, ఆ తర్వాత తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లనున్నారు. ఆయా జిల్లాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకొని జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే దానిపై వివరాలు సేకరించనున్నారు.
దాదాపు వారం రోజుల పాటు పర్యటించిన అనంతరం వారు డీసీసీ అధ్యక్షులుగా ఎవరైతే బాగుంటుందనే దానిపై హైకమాండ్ కు ఐదు పేర్లను సిఫారసు చేయనున్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో పేరును పంపనున్నారు. ఆయా జిల్లాల్లో సామాజికసమీకరణలను పరిగణలోకి తీసుకొని, పార్టీకి విధేయత, సీనియార్టీ వంటి అంశాలను కూడా గుర్తించి ఇందులో ఒక్కరిని డీసీసీ అధ్యక్షునిగా హైకమాండ్ నియమించనుంది.