కొట్లాటలొద్దు.. కలిసి పనిచెయ్యాలె: మల్లికార్జున ఖర్గే

కొట్లాటలొద్దు.. కలిసి పనిచెయ్యాలె: మల్లికార్జున ఖర్గే
  • కాంగ్రెస్ సీనియర్లకు ఖర్గే క్లాస్​
  • ఎన్నికల వేళ విభేదాలు మంచిది కాదని హితవు 
  • డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన 
  • త్వరలోనే రాహుల్, ప్రియాంక వస్తారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్ అయినట్టు తెలిసింది. ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో పార్టీ నేతల మధ్య విభేదాలు మంచిది కాదని హితవు చెప్పినట్టు సమాచారం. చేవెళ్ల ప్రజాగర్జన సభ అనంతరం శనివారం రాత్రి ఆయన శంషాబాద్​లోని నోవాటెల్ హోటల్​లో బస చేశారు. ఆదివారం ఉదయం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు దామోదర రాజనర్సింహ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు సీనియర్లతో ఆయన భేటీ అయినట్టు తెలిసింది. 

ఈ భేటీలో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విషయంతో పాటు పార్టీ నేతల మధ్య విభేదాలపైనా చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నదని నేతలు ఖర్గేకు వివరించినట్టు తెలుస్తోంది. అయితే, గ్రాఫ్ పెరిగినా నేతల మధ్య విభేదాలుంటే పార్టీకి నష్టం జరుగుతుందని, కొట్లాటలను పక్కనపెట్టి కలసి పని చేయాలని సూచించినట్టు తెలిసింది. 

ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆయన చెపినట్టు సమాచారం. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించొద్దని మందలించినట్టు తెలిసింది.  

డిక్లరేషన్లు ఇంటింటికీ చేరాలె..  

కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు ఖర్గే సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో అన్ని డిక్లరేషన్లనూ జనానికి వివరించాల్సిందిగా చెప్పినట్టు తెలిసింది. మైనారిటీ, బీసీ డిక్లరేషన్లను కూడా పటిష్ఠంగా తయారు చేయాలని ఆదేశించారని సమాచారం. ఇవన్నీ ఇంటింటికీ చేరేలా కేడర్​తో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారని తెలిసింది. త్వరలో రాష్ట్రానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తారని, ఇకపై జాతీయ నేతల పర్యటనలు వరుసగా ఉంటాయని చెప్పినట్టు సమాచారం. 

అవసరమైతే తాను కూడా మళ్లీ వస్తానని హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ పొత్తు చెడిపోవడంపైనా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఎన్నికల్లో అవసరమైతే వారిని కలుపుకోవాలని నేతలకు ఖర్గే సూచించారని తెలుస్తోంది. కాగా, పార్టీకి చెందిన పలువురు నేతలు తమకు టికెట్​ ఇప్పించాలంటూ ఖర్గే దగ్గర రిక్వెస్ట్​చేసినట్టు సమాచారం.