
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని జహీరాబాద్, వనపర్తి, హుజూర్‌నగర్‌లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభలలో ఆయన హాజరై ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో ఆయన సభలకు రాష్ట్ర కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రచార నేపథ్యంలో రాహుల్ గాంధీ గత రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ శ్రేణుల సమాచారం మేరకు రాహుల్ గాంధీ ఈ ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రాయం నుంచి జహిరాబాద్ కు బయలుదేరనున్నారు. జహిరాబాద్ సమీపంలోని పస్తాపూర్ హెలిప్యాడ్‌కు చేరుకొని అక్కడి బహిరంగసభలో ప్రసంగిస్తారు. 1.45 గంటలకు వనపర్తి చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు హుజూర్ నగర్‌లో జరగనున్న సభకు రాహుల్ గాంధీ హాజరవుతారు.