మజ్లిస్​కు 6 మున్సిపాలిటీలు!…TRS​తో MIM అండర్​స్టాండింగ్

మజ్లిస్​కు 6 మున్సిపాలిటీలు!…TRS​తో MIM అండర్​స్టాండింగ్

టీఆర్​ఎస్​తో ఎంఐఎం ముందస్తు అండర్​స్టాండింగ్

తాండూర్, జల్​పల్లి, సంగారెడ్డి, భైంసా, బోధన్, మహబూబ్‌నగర్/ఆదిలాబాద్​పై చర్చలు

కేటీఆర్​ ముందు అసదుద్దీన్​ ప్రతిపాదన?

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా టీఆర్​ఎస్​ ఓకే!

భైంసాలో ఇప్పటికే ఏకగ్రీవాలకు సహకారం

ఎంఐఎం ఉన్న చోట గులాబీ డమ్మీలు.. కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కాంటెస్ట్

టీఆర్​ఎస్, ఎంఐఎం మధ్య సీట్ల సర్దుబాటు ఆసక్తికరంగా మారింది. అధికారికంగా ప్రకటించకపోయినా.. అండర్​ స్టాండింగ్​తో మున్సిపోల్స్​లో సీట్లను పంచుకునేందుకు రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆరు మున్సిపల్ చైర్​పర్సన్​ సీట్లు తమకే ఇవ్వాలని ఎంఐఎం నేతలు టీఆర్​ఎస్​కు ప్రతిపాదించినట్లు సమాచారం. ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్​ ఒవైసీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మధ్య ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరిగినట్లు ప్రచారంలో ఉంది. ప్రధానంగా తాండూర్, జల్​పల్లి, సంగారెడ్డి, భైంసా, బోధన్, మహబూబ్‌నగర్ లేదా ఆదిలాబాద్ మున్సిపల్ చైర్​పర్సన్​ పదవులు తమ పార్టీకి ఇవ్వాలని ఎంఐఎం కోరుతోంది. ఇదే విషయాన్ని కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లాలని కేటీఆర్​ను అసదుద్దీన్​ కోరినట్లు తెలిసింది. అడిగినన్ని సీట్లు ఇవ్వాలా..? ఒకటీరెండుతో సర్దుబాటు చేయాలా..? అని టీఆర్​ఎస్​ మల్లగుల్లాలు పడుతోంది.

భైంసాలో సహకారం!

ఇప్పటికే ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తానా కొనసాగిస్తోంది. ఎంఐఎం తమ ఫ్రెండ్లీ పార్టీ అని స్వయంగా సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో భాగంగానే ఎంఐఎం పోటీలో ఉన్న పలు చోట్ల టీఆర్​ఎస్​ డమ్మీ అభ్యర్థులను పోటీకి దింపింది. భైంసా మున్సిపాలిటీలో టీఆర్​ఎస్​ తన ముగ్గురు క్యాండిడేట్లు పోటీ నుంచి తప్పించి.. మూడు వార్డులను ఎంఐఎం ఏకగ్రీవంగా గెలుచుకునేందుకు లైన్​ క్లియర్​ చేసింది. భైంసాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లోనూ ఈ రాజకీయ అవగాహన  రెండు పార్టీల మధ్య స్పష్టంగా కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 47 పట్టణాల్లో మొత్తం 441 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించిన ఎంఐఎం 135 వార్డుల్లో తమ క్యాండిడేట్లతో విత్‌‌‌‌‌‌‌‌ డ్రా  చేయించి.. చివరికి 276 వార్డుల్లో పోటీకి నిలిచింది. నిజామాబాద్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో 25 డివిజన్లు, జల్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో, తాండూర్‌‌‌‌‌‌‌‌లో 20, బోధన్‌‌‌‌‌‌‌‌లో 19,  భైంసాలో 18 వార్డుల్లో, నిర్మల్, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో 17 వార్డుల చొప్పున, మహబూబ్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌లో 13, సంగారెడ్డిలో 12, నల్గొండ, కోరుట్లలో 9 చొప్పున, కామారెడ్డి, పెద్దపల్లిలో 6 చొప్పున, జగిత్యాల, మెట్​పల్లిలో 5 వార్డుల చొప్పున, రామగుండం, నారాయణపేట, మరిపెడ, నార్సింగి, గద్వాల్, వడ్డెపల్లిలో 4 వార్డు చొప్పున ఎంఐఎం పోటీ చేస్తోంది. మరో 25 వార్డుల్లో ఒకటి నుంచి మూడు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ మున్సిపాలిటీల్లోని అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు పోటీ చేస్తున్నప్పటికీ.. పలు స్థానాల్లో  డమ్మీ అభ్యర్థులను రంగంలోకి దించినట్లు ప్రచారంలో ఉంది.

గత ఎన్నికల్లోనూ ఫ్రెండ్​షిప్​

తాండూర్ మున్సిపల్ చైర్​పర్సన్​ పీఠాన్ని గత పాలకవర్గంలో టీఆర్ఎస్, ఎంఐఎం తలా రెండున్నరేండ్లు పంచుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఫ్రెండ్లీగానే పోటీ చేసినా టీఆర్ఎస్ 99 డివిజన్లను గెలుచుకోవడంతో పాలకవర్గంలో ఎంఐఎంకు పదవులేవీ ఇవ్వలేదు. అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు, లోక్​సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్, ఎంఐఎం తమ స్నేహబంధాన్ని కొనసాగించాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీల మధ్య అదే తరహా ఫ్రెండ్​షిప్ కొనసాగుతోంది.  ఈ క్రమంలోనే ఎంఐఎం మున్సిపల్ చైర్​పర్సన్​ పీఠాలపై కన్నేసింది. తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ఆ పార్టీ అధినేత అసద్​ రంగంలోకి దిగారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు పోతుందోనని, తమ అనుచరులకు ఎక్కడ పదవులు దక్కకుండా పోతాయోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని గురువారం తెలంగాణ భవన్​లో ఓ నేత కొందరి ముందు వెళ్లబోసుకున్నాడు.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి