- రాష్ట్రవ్యాప్తంగా 70 స్థానాల్లో విజయం
- 48 మంది కౌన్సిలర్లు, 22 మంది కార్పొరేటర్ల గెలుపు
- నిజామాబాద్‌లో కింగ్ మేకర్‌గా పార్టీ
- ఎంఐఎంకు రెండు సీట్ల దూరంలో భైంసా
- రెబల్స్, కాంగ్రెస్ మద్దతు కోసం ఒవైసీ ప్రయత్నాలు
- స్వతంత్రులంతా తమకే మద్దతిస్తారంటున్న బీజేపీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో మొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసిన ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ ఎన్నికల ఫలితాల్లో తన సత్తా చాటింది. మున్సిపల్ కౌన్సిలర్లుగా 48 మంది, కార్పొరేటర్లుగా 22 మంది గెలుపొందడంతో మొత్తం 70 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు.
ముస్లిం మైనార్టీల బలం ఉన్న ప్రాంతాల్లో పార్టీ తన బలాన్ని నిరూపించుకుంది. మున్సిపాలిటీల్లో భైంసా (12), బోధన్ (12), అదిలాబాద్ (6), నిర్మల్ (3), జహీరాబాద్ (2), నారాయణపేట్ (2), జగిత్యాల (2) తదితర ప్రాంతాల్లో మున్సిపల్ కౌన్సరలర్లను గెలుచుకుని ఎంఐఎం బలమైన పార్టీగా నిలిచింది. మిగతా మున్సిపాలిటీల్లో సంగారెడ్డి, కాగజ్‌నగర్, గద్వాల్, కోహిర్, కొడంగల్, వికారాబాద్, ఆర్మూర్, తాండూర్, బన్స్‌వాడ వంటి చోట్ల ఒక్కో స్థానం సాధించింది.
నిజామాబాద్‌లో 14 స్థానాలు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 14 కార్పొరేటర్లను గెలుచుకున్న ఎంఐఎం కింగ్‌మేకర్ స్థానంలో నిలిచింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఇక్కడ మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అదే విధంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మూడు, మహబూబ్‌నగర్‌లో మూడు, నల్గొండలో రెండు గెలిచారు.
ఫలిస్తున్న అసద్ వ్యూహం
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. గతంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి పరిమితమైన ఎంఐఎం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తన ప్రభావాన్ని విస్తరించింది. పోస్ట్ పోల్ అలయన్స్‌ల ద్వారా మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో కీలకంగా మారుతున్నట్లు స్పష్టమవుతున్నది.
ఎంఐఎంకు రెండు సీట్ల దూరంలో భైంసా
నిర్మల్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 12 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 6, కాంగ్రెస్ 1 స్థానాలకు పరిమితమైంది. ఏడుగురు స్వతంత్రులు గెలుపొందారు. చైర్‌పర్సన్ పీఠానికి ఎంఐఎంకు రెండు సీట్లు దూరంలో ఉంది. మజ్లిస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో తిరుగుబాటు చేసిన ఇద్దరు రెబల్స్ గెలిచారు. వీరిద్దరితో పాటు కాంగ్రెస్ మద్దతు కోసం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నాలు చేస్తున్నారు. ముగ్గురు మద్దతిస్తే భైంసాలో ఎంఐఎం చైర్‌పర్సన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది.
మరోవైపు ఐదుగురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఎంఐఎం రెబల్స్ తప్ప మిగిలిన స్వతంత్రులు బీజేపీతో టచ్‌లో ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఎంఐఎం అభ్యర్థి జాబీర్ అహ్మద్‌పై ఆగ్రహంతో ఉన్న రెబల్స్ బీజేపీకి మద్దతిస్తారని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి నిమ్మల ప్రవీణ్ చైర్‌పర్సన్ రేసులో ఉన్నారు. స్వతంత్రుల్లో తూమోళ్ల ప్రవీణ్ కూడా పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భైంసాలో చైర్‌పర్సన్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.
