- పలుచోట్ల 170-300 వరకు ఏక్యూఐ
- కంపు కొడుతున్న 100 చెరువులు
- 90 శాతం చెరువుల్లో పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్
- 2 పీపీఎం కన్నా తక్కువగా డిసాల్వ్డ్ ఆక్సిజన్
- వాహనాలు, కన్స్ట్రక్షన్, ఫ్యాక్టరీల పొల్యూషన్, కెమికల్స్, వేస్ట్ మేనేజ్‌మెంట్ లోపమే కారణం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లో గాలి, నీరు విషతుల్యం అవుతున్నాయి. ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం ఇప్పుడు కలుషితం అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న వాహనాలు, కన్స్ట్రక్షన్స్ వల్ల వెలువడే దుమ్ము, పరిశ్రమల పొగతో గాలి నాణ్యత పడిపోతుండగా, నీటి కాలుష్యం ఇదే తరహాలో పెరిగిపోతోంది. గ్రేటర్ పరిధిలోని 90% చెరువుల్లో ఆక్సిజన్ లెవల్స్ (డిసాల్వ్డ్ ఆక్సిజన్) ప్రమాదకర స్థాయికి పడిపోవడమే దీనికి ఉదాహరణ.
డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక మురుగంతా చెరువుల్లోకి చేరడం, ఫ్యాక్టరీల నుంచి కెమికల్స్కలవడంతో ఒకప్పుడు తాగడానికి పనికొచ్చిన చెరువులు ఇప్పుడు చేపలు బతికేందుకు కూడా వీల్లేకుండా పోతున్నాయి. దీనివల్ల భూగర్భ జలాలు కూడా కలుషితమై ఆరోగ్యం దెబ్బతింటోంది. దీన్నంతా మానిటర్ చేస్తూ పొల్యూషన్‌ను అరికట్టాల్సిన పీసీబీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూల్స్ ప్రకారం వేస్ట్ మేనేజ్‌మెంట్ చేయకపోవడం, వెహికల్ పొల్యూషన్పరీక్షలను కఠినంగా అమలు చేయకపోవడం వల్ల పరిస్థితి చెయ్యి దాటిపోతోంది. దీంతో శ్వాసకోస సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తులు చెడిపోవడం, చర్మ సమస్యలతో పాటు ఇతర అనారోగ్యాలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ కూడా ఢిల్లీలా కాలుష్యమయంగా మారకముందే మేల్కోవాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో గత నెలలో గాలి కాలుష్యం రెడ్, ఆరెంజ్ స్థాయికి చేరుకున్నది. వివిధ ప్రాంతాల్లో గాలిలో పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం)10, పీఎం 2.5 ధూళికణాలు అమాంతం పెరిగాయి. సాధారణంగా గాలిలో పీఎం 2.5 కణాలు క్యూబిక్‌మీటర్‌కు 60 మైక్రోగ్రాములు, పీఎం 10– 100 కణాలు క్యూబిక్‌మీటర్‌కు మైక్రోగ్రాములు ఉండాలి.
అయితే, నగరంలో గత నెలలో కొన్ని చోట్ల పీఎం10 కణాలు క్యూబిక్ మీటర్‌కు180 నుంచి 200 మైక్రోగ్రాములకు, పీఎం 2.5 సైజు కణాలు150 మైక్రోగ్రాముల వరకు చేరాయి. పరిశ్రమల నుంచి వచ్చే పొగ, చెత్తచెదారం తగలబెట్టడం వల్ల పీఎం10 ధూళి కణాలు అధికంగా ఏర్పడతాయని, సిటీలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే చోట పెట్రోలు, డీజిల్ వాహనాల పొగతో పీఎం 2.5 కణాలు ఎక్కువగా ఏర్పడతాయని చెప్తున్నారు.
300 దాటిన ఏక్యూఐ
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఎక్యూఐ) లెవెల్స్ తెలుసుకునేందుకు పీసీబీ నగరంలో14 స్టేషన్లను ఏర్పాటు చేసింది. గత నెలలో పలుచోట్ల 300కి పైగా ఏక్యూఐ నమోదు కావడం కలవరానికి గురి చేస్తోంది. ఈ నెలలో 160 నుంచి 170 వరకు రికార్డయ్యింది. పీసీబీ లెక్కల ప్రకారం గత నెల 1న జూపార్కు వద్ద 213, 2న 304 , 3న 277 ఏక్యూఐ నమోదైంది. 2న బొల్లారం వద్ద 202 , ఇక్కడే17న 250, డిసెంబర్ 6న పాశమైలారంలో 210, ఇదే రోజు ఇక్రిసాట్ వద్ద 203, 17న సనత్ నగర్ వద్ద 207 నమోదైందని పీసీబీ అధికారిక లెక్కలే చెప్తున్నాయి.
గత నెలలో 200 నుంచి 300కిపైగా ఎక్యూఐ నమోదు కావడంపై పీసీబీ అధికారులు మాట్లాడుతూ.. గతనెలలో జూపార్కుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కన్ స్ర్టక్షన్ అండ్ డిమాలిషన్ వల్ల పెరిగి ఉండవచ్చన్నారు. అలాగే చెత్త కాల్చడంతోపాటు ట్రాఫిక్ జామ్స్ తో కూడా ఈ స్థాయి ఏక్యూఐ వస్తుందంటున్నారు. అలాగే చలి వాతావరణంలో కాలుష్య తీవ్రత పెరుగుతుందంటున్నారు. థర్డ్ పార్టీ యాప్ లను పట్టించుకోవద్దని పీసీబీ చెప్తోంది. సీపీసీబీ అఫీషియల్ యాప్ ‘సమీర్’ డేటానే కరెక్ట్ గా ఉంటుందని, థర్డ్ పార్టీ యాప్ ల లెక్కలు 50 శాతం ఎక్కువగా ఉంటాయని పేర్కొంటోంది.
543 చెరువుల్లో100 నాశనం
గ్రేటర్లో ప్రస్తుతం హైడ్రా పరిధిలో 549 చెరువులుండగా దాదాపు 100 చెరువులు కంపు కొడుతున్నాయి. దుండిగల్‌లోని కుడికుంటలోకి పరిశ్రమల నుంచి కెమికల్స్వచ్చి చేరుతుండటంతో అందులో చేపలు కూడా బతకలేని పరిస్థితి ఉంది. ఇదే ప్రాంతంలోని చింతల కుంట-లోకి కాలనీల మురుగు కలుస్తోంది. ఇబ్రహీంబాగ్ చెరువు, నల్లచెరువు పరిస్థితి కూడా ఇదే. అపార్ట్మెంట్లలో సీవరేజీ ట్రీట్ ప్లాంట్లు పెట్టుకోవాలనే రూల్స్ఉన్నా ప్లాంట్లు పెడితే కరెంట్బిల్లు లక్షల్లో వస్తుందని మురుగునీటిని చెరువుల్లోకి వదులుతున్నారని తేలింది.
సిటీలోని దుర్గం చెరువుతోపాటు మన్సూరాబాద్ పెద్ద చెరువు, ఘట్ కేసర్ మండలంలోని ఎదులాబాద్ చెరువు కూడా తీవ్రంగా కలుషితమయ్యాయి. కాగా, గ్రేటర్ లోని వందలాది చెరువుల్లో ఏ ఒక్క చెరువులో కూడా చేపలు బతికేందుకు అనుకూలంగా లేదని ఇటీవల మత్స్యశాఖ చేసిన అధ్యయనంలో తేలింది. చెరువుల్లో హానీకరమైన ఫ్యాక్టరీల కెమికల్స్ కలుస్తుండటంతో చేపలు బతకడం లేదు.
ఎస్టీపీలు ఏర్పాటు చేస్తేనే..
తాగునీటి ప్రాజెక్టులైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల్లోని నీళ్లు కూడా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న డ్రెయిన్ వాటర్‌తో కలుషితమవుతున్నాయి. హిమాయత్ సాగర్ లోకి శంషాబాద్, కొత్వాల్ గూడ నాలాల ద్వారా మురుగు చేరుతోంది. అలాగే అజీజ్ నగర్ వెనుక భాగం నుంచి మురుగు నేరుగా చేరుతోంది. ఇక గండిపేట్ లోకి ఎక్కువగా హిమాయత్ నగర్ విలేజ్, జన్వాడ నుంచి మురుగు చేరుతోంది. వట్టినాగుల పల్లి, ఖానాపూర్ మీదుగా వచ్చే నాలా నియోపొలిస్ సమీపంలో గండిపేట్ చెరువులో కలుస్తోంది. రెండు జలాశయాల్లోని పరిసర ప్రాంతాల ఫాంహౌస్‌లు కూడా నీళ్ల కలుషితానికి కారణమవుతున్నాయి. అందుకే జంట జలాశయాల్లోకి మురుగు నీరు రాకుండా శుద్ధి చేసి వదిలేందుకు ఎస్టీపీలను ఏర్పాటు చేస్తేనే కాలుష్యాన్ని నివారించవచ్చని
చెప్తున్నారు.
ఢిల్లీలా కాకముందే చర్యలు తీసుకోవాలి
సిటీలో గాలి కాలుష్యం పెరుగుతోంది. ప్రాంతాన్ని బట్టి గాలిలో మార్పులుంటాయి. కాలుష్య నమోదు యంత్రం ఏర్పాటు చేసిన చోట నీళ్లు స్ర్పే చేయడం, ఇతర కారణాల వల్ల తక్కువ వ్యాల్యూస్వస్తుంటాయి. పొల్యూషన్ తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్ కూడా ఢిల్లీ మాదిరి కాకముందే చర్యలు తీసుకోవాలి.
- దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త
గత నెల హైదరాబాద్‌లో నమోదైన ఏక్యూఐ
జూపార్కు
304
బొల్లారం
250
పాశమైలారం
210
సనత్ నగర్
207
ఇక్రిశాట్
203
