అమెరికాలో ఊహించని ఘటన. న్యూయార్క్ సిటీలోని లాగార్డియా ఎయిర్ పోర్టులో కెనడా విమానం ప్రమాదానికి గురైంది. 2026, మార్చి 23వ తేదీ ఉదయం మాంట్రియల్ నుంచి CRJ 900 నెంబర్ కెనడా ఎక్స్ ప్రెస్ విమానం న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. ల్యాండ్ అయిన విమానం అదుపు తప్పింది. రన్ వేపై వేగంగా వెళ్లి.. ట్రక్కులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం దెబ్బతిన్నది.
ఎయిర్ పోర్టులో ప్రమాదం జరగటంతో భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యింది. విమానం అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్లందరూ ఆరోగ్యంగానే ఉన్నారని.. ప్రమాదం తర్వాత తీవ్ర ఆందోళన చెందినట్లు ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం తర్వాత న్యూయార్క్ లాగార్డియా ఎయిర్ పోర్టులో విమానం రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాదానాకి కారణాలపై విచారణ చేస్తున్నారు అధికారులు.
విమానం ప్రమాదం తెలిసిన తర్వాత అమెరికా భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇది కేవలం ప్రమాదమేనా లేక మరేదైనా కారణం ఉందా అనే విషయాలపై పైలెట్లను విచారిస్తున్నారు అధికారులు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫొటోలు చూస్తుంటే.. విమానం ముందు భాగంగా బాగా దెబ్బతిన్నది. అదే సమయంలో విమానం వెనక భాగంలోని చక్రాలు సైతం కనిపించటం లేదని.. ఇది పెద్ద ప్రమాదం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై విచారణ జరుగుతుందని.. కారణాలు తర్వాత వెల్లడిస్తామని ఎయిర్ పోర్టు వర్గాలు ప్రకటించాయి.
