లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ట్రైనీ విమానం బుధవారం (జనవరి 21) ప్రయాగ్‌రాజ్‌లోని కేపీ ఇంటర్ కాలేజీ వెనుక ఉన్న చెరువులో కుప్పకూలింది. సమాచారం అందుకున్న అత్యవసర బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి.
ప్రమాదానికి గురైన విమానం భారత వైమానిక దళానికి చెందిన మైక్రోలైట్ విమానమని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు సిబ్బంది ఉన్నారని.. ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు ఐఏఎఫ్ వెల్లడించింది.
గాలిలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయిన విమానం ఆ తర్వాత చెరువులో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం చెరువులో పడిపోగానే దట్టమైన పొగలు వెలువడ్డాయని చెప్పారు. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారని తెలిపారు.
